చైనా బెదిరింపు వైఖరి సరికాదు : పాంపియో
సరిహద్దు దేశాలను బెదిరించేలా చైనా వ్యవహరించడం తగదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. లండన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌తో తాను జరిపిన చర్చల్లోనూ చైనా గురించి ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో చైనా ఘర్షణలకు దిగుతున్న తీరు ఆమోదయోగ్యం కాదని సృష్టం చేశారు. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కొనియాడారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ విసురుతున్న సవాళ్లే మిటో మునుపెన్నడూ లేనంత సృష్టంగా కనిపిస్తున్న తరుణంలో భారత్- అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని పాంపియో అభిప్రాయపడ్డారు. అమెరికా- భారత్ వాణిజ్య మండలి నిర్వహించిన ఇండియా ఐడియాస్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. అమెరికా- భారత్‌ల నడుమ విస్తరిస్తున్న సంబంధాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా సహా అనేక దేశాల విశ్వాసాన్ని పొందగలగడం వల్లనే భారత్ ప్రస్తుతం ఈ స్థితిలో నిల్చొందని చెప్పారు. చట్టబద్ధత లేకుండా సముద్రంపై హక్కుల్ని చైనా కోరడం తగదని అన్నారు.













