కశ్మీర్‌పై ట్రంప్ సమక్షంలో తేల్చి చెప్పిన మోదీ
జమ్ముకశ్మీర్ అంశంలో భారత్, పాక్ మధ్య మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఎలాంటి ఆస్కారం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఇరుదేశాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలవని సృష్టం చేశారు. ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ట్రంప్ కూడా మోదీతో పాటు ఉన్నారు. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ మోదీ, ఇమ్రాన్‌ఖాన్ తనకు మంచి మిత్రులని, కశ్మీర్ వివాదాన్ని వారు పరిష్కరించుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల భేటీ ముగిసిన అనంతరం విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడుతూ అమెరికా నుంచి దిగుమతులను పెంచనున్నట్లు ట్రంప్‌తో ప్రధాని పేర్కొన్నారన్నారు. అలాగే వాణిజ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు త్వరలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారని చెప్పారు.













