వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం.. స్వాగతం పలికిన బైడెన్ దంపతులు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అగ్రరాజ్యం అమెరికాలో ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు వెళ్లిన ఆయనకు అక్కడ జోబైడెన్ దంపతులు స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 19 తుపాకులతో సాయుధ సైనికులు మోదీకి గౌరవ వందనం సమర్పించారు. వైట్‌హౌస్‌లో మోదీ, బైడెన్ సమావేశమై ఇరు దేశాల సంబంధాలపై చర్చిస్తారు. ఈ సమావేశంలో రక్షణ రంగం, నూతన సాంకేతికతలు, ఆరోగ్య రంగం, పర్యావరణం, వీసాలు, అత్యవసర సేవలు తదితర విషయాల్లో పరస్పర సహకారం కోసం ఒప్పందాలు కూడా చేసుకుంటారని సమాచారం. అనంతరం ఇరువురు నేతలు కలిసి మీడియా సమావేశంలో పాల్గొటారు. ఇలా వైట్‌హౌస్‌లో మోదీ అడుగుపెట్టిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 21వ శతాబ్దంలో అన్ని దేశాల సంబంధాల కన్నా కూడా అమెరికా, భారత్ మధ్య బంధం అత్యంత ముఖ్యమైందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల రాజ్యాంగాల్లో తొలి మాడు మాటలు ‘వుయ్ ద పీపుల్’ అనే ఉంటాయని చెప్పిన ఆయన.. రెండు సార్వభౌమ దేశాలను కలిపే అంశం ఇదేనన్నారు






