Fortius Sports Academy: అమెరికాలో 11 రాష్ట్రాల నుంచి క్రీడాకారులతో ‘ఫోర్టియస్’ బ్యాడ్మింటన్ టోర్నీ!
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఆల్ఫారెట్టా (Alpharetta) వేదికగా ‘ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ’ (Fortius Sports Academy)లో ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ‘యూఎస్ఏ బ్యాడ్మింటన్ సౌత్ రీజియన్ క్లోజ్డ్ రీజినల్ ఛాంపియన్షిప్’ (USA Badminton South Region Closed Regional Championship) పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో దక్షిణాదిలోని 11 రాష్ట్రాల నుంచి సుమారు 64 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీని యూఎస్ఏ బ్యాడ్మింటన్ (USAB) గుర్తింపుతో నిర్వహించారు. డల్లాస్ నుంచి వచ్చిన టోర్నమెంట్ రెఫరీ రూడీ (Rudy) మ్యాచ్లను పర్యవేక్షించారు. క్రీడాకారుల భద్రతకు, విశ్రాంతికి పెద్దపీట వేస్తూ షెడ్యూల్ రూపొందించామని, ఫోర్టియస్ అకాడమీలో సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. అకాడమీ నిర్వాహకులు అనుమాన్ మిశ్రా (Anuman Misra) మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన ‘అట్లాంటా బ్యాడ్మింటన్ ఓపెన్’ విజయవంతం కావడం తమకు స్ఫూర్తినిచ్చిందని, బ్యాడ్మింటన్తో పాటు టేబుల్ టెన్నిస్, పికిల్ బాల్ క్రీడలను కూడా తమ అకాడమీ ద్వారా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
చిన్నారుల నుంచి యువత వరకు ఎంతో ఆసక్తిగా పాల్గొన్న ఈ టోర్నీ, స్థానిక క్రీడాకారుల్లో పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా జాతీయ స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ టోర్నమెంట్లో స్థానిక ప్రతిభావంతులు సత్తా చాటారు. ఫోర్సిత్ కౌంటీ (Forsyth County)కి చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. విజేతల పూర్తి జాబితా అధికారికంగా వెల్లడికాకపోయినప్పటికీ, స్థానిక విద్యార్థులు అధిక సంఖ్యలో పతకాలు గెలుచుకోవడం విశేషం






