తానా మహాసభలకు జనసేన అధ్యక్షుడు
తానా 22వ మహాసభలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. జులై 4 నుంచి 6 వరకు అమెరికాలో వాషింగ్టన్ డీసీ కన్వెన్షన్ సెంటర్లో మహాసభలు జరగనున్నాయి. దీనికి దేశవిదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయనేతలు, సినీ కళాకారులు, రంగస్థల నటులు, నృత్య కళాకారిణులు, గాయనీ గాయకులు, సాహితీవేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారని తాజా అధ్యక్షుడు సతీశ్ వేమన తెలిపారు. ప్రణాళికాబద్ధంగా సభలు నిర్వహించేందుకు వీలుగా వేర్వేరు కమిటీలు నియమించినట్లు చెప్పారు.
జులై 4న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు తానా పురస్కారాలు అందిస్తామని తెలిపారు. అవార్డ్స్ బాంక్వెట్ పేరుతో నిర్వహించే విందులో సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి నిర్వహిస్తామన్నారు. 5న గాయని సునీత లైవ్, 6న సంగీత దర్శకులు కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు ఉంటాయన్నారు. వేడుకలకు హాజరు కావాలనుకునేవారు తానా కాన్ఫరెన్స్ వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.













