ఢిల్లీలో రైలు ఆపాలని డొనాల్డ్ ట్రంప్ కు వినతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారతీయుల్లో నమ్మకం గట్టి పడుతోంది. భారతదేశంలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయనకు వినతులు వెళుతున్నాయి. ఢిల్లీ సమీపంలోని రేవారి మార్గంలో పాలం రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ చేతక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగడం లేదు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఓ ప్రయాణికుల సంఘం ఆరోపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభులకు విజ్ఞప్తులు పంపించినప్పటికీ ఫలితం లేదని వాపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సంఘం ప్రతినిధి ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయాన్ని కోరుతూ ఓ ట్విట్ చేశారు.
భారతదేశంలో ఢిల్లీ- రేవారీ మార్గంలో పాలం రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్లో చేతక్ ఎక్స్‌ప్రెస్(12981-12982) ఆగడం లేదు. రైల్వే శాఖ మంత్రికి, రైల్వే అధికారులకు చాలా సార్లు లేఖలు రాసిన ఫలితం ఉండటం లేదు. మీరు ఓసారి రైల్వే శాఖ మంత్రికి లేఖ రాయండి, బహుశా ఏమైనా మంచి జరగవచ్చునేమో బాలకృష్ణ అమరసారియా, ఢిల్లీ, భారతదేశం అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మీడియాకు ఈ సంఘం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం పాలం రైల్వే స్టేషన్లో చేతక్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలని ప్రయాణికులు చాలా విజ్ఞప్తలు చేశారు. అయినప్పటికీ ఎటువంటి స్పందనా కనిపించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వారు తమ గోడు వినిపించారు.













