అమెరికాతో స్నేహం కొనసాగుతుంది : పాక్
అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహ్మినా జన్జ్వా అన్నారు. అమెరికా నుంచి వస్తున్న ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత ఉందని పాకిస్థాన్ విదేశీ విధానంపై కరాచీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఐబిఎ)లో ప్రసంగిస్తూ ఆమె వెల్లడించారు. అంతర్జాతీయంగా శక్తిమంతమైన దేశంగానే కాకుండా దక్షిణాసియాలో అమెరికా ప్రభావం ఉందని దీంతో అమెరికాను పొరుగు దేశంగా భావిస్తున్నామని అమెరికాతో స్నేహపూర్వకంగా మెలగాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
జనవరి 1న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఆయన అలా అనడానికి గల కారణాలను పాకిస్థాన్ విశ్లేషించే ప్రయత్నంలో ఉందన్నారు. పాకిస్థాన్‌కు భద్రత, రక్షణ విభాగాల్లో సహాయాన్ని నిలిపేస్తూ ట్రంప్ జనవరి 1న ప్రకటించకముందు అగ్రరాజ్యంతో జరిగిన అన్ని సమావేవాలు సానుకూలంగా జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గత 15 ఏళ్లలో పాకిస్థాన్‌కు దాదాపు వందల కోట్ల డాలర్ల సాయం చేస్తే పాకిస్థాన్ అమెరికాను మోసం చేసిందని నూతన సంవత్సరం రోజున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.













