విజయవంతంగా ప్రారంభమైన పాఠశాల-తానా తెలుగు పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) – పాఠశాల కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్నారులకు తెలుగుభాషపై మక్కువ పెంచే విధంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వివిధ నగరాల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కొలంబస్లో తొలుత ఈ పోటీలు మే 4వ తేదీన ప్రారంభమయ్యాయి.
కొలంబస్లో
కొలంబస్లో మే 4వ తేదీన ఈ పోటీలను ప్రారంభించారు. తెలుగు పలుకు, తెలుగు వెలుగు పోటీల్లో ఎంతోమంది పిల్లలు పాల్గొని తమకు తెలుగు భాషపై ఉన్న సత్తాను చాటారు. ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు, బహూమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుష్ ఉప్పుటూరి, రాజా రవి, శ్రీనివాస్ సంగ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.
బే ఏరియాలో
బే ఏరియాలో మే 11వ తేదీన తెలుగు పోటీలను తానా-పాఠశాల కలిసి నిర్వహించాయి. పాఠశాల వసంతోత్సవ వేడుకల్లోనే జరిగిన ఈ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది పిల్లలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. దాదాపు 40 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచినవారు వాషింగ్టన్ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే తానా మహాసభల వేదికపై జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. డా. గీతామాధవి, పద్మశొంఠి, శ్రీదేవి ఎర్నేని, కళ్యాణి తదితరులు చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. విజేతలకు తానా నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి సర్టిఫికెట్లను, ట్రోఫీని బహూకరించారు.













