రాయగడలో పాఠశాల ప్రారంభం
అమెరికాలో గత 5 సంవత్సరాలుగా తెలుగు చిన్నారులకు మాతృభాష తెలుగును బోధిస్తున్న ‘పాఠశాల ఇంక్’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ‘తెలుగు పలుకు’ కోర్స్ ద్వారా ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు చిన్నారులకు తెలుగు భాషను బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పాఠశాల ప్రారంభమైంది. తాజాగా ఒరిస్సాలోని రాయగడలో కూడా ‘పాఠశాల’ను ప్రారంభించారు.
డాక్టర్ బాబూరావు మహంతి అధ్యక్షతన ప్రారంభ కార్యక్రమం జరిగింది. అతిథులుగా బ్రహ్మానందపట్నాయక్, మహేష్ పట్నాయక్, జి.గౌరీప్రసాద్, టీవీఎన్ అప్పారావులు హాజరై పాఠశాలను ప్రారంభించారు. డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ పాఠశాల 4 సంవత్సరాల తెలుగుపలుకు కోర్సు ను అందిస్తోందని, అందులో చేరిన వారు ఆన్లైన్లో ద్వారా కూడా చదువుకోవచ్చని అలాగే ప్రతి శనివారం, ఆదివారం క్లాసులు నిర్వహిస్తారని, దానికి సంబంధించిన రుసుమును చెల్లించవలసి ఉంటుందని వివరించారు.
గత 10 సంవత్సరాలుగా రాయగడ జిల్లాలో తెలుగు విద్యాలయాలు సంపూర్ణంగా మూతపడిన తరువాత రాయగడలో తెలుగుభాష అంతరించిపోయే స్థితికి రావడంతో పాఠశాల ద్వారా తెలుగు పలుకును ప్రారంభించి తెలుగుభాషకు జీవం పోశారని చెప్పారు. ఈ తెలుగుపలుకును గురజాడ వెంకటఅప్పారావుకు అంకితం చేస్తున్నామని తెలిపారు. విద్యాసాగర్ మహంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













