అన్నీ చోట్లకు విస్తరిస్తున్న ‘పాఠశాల’
వివిధ కార్యక్రమాలు…ప్రచారాలతో దూసుకెళుతున్న తానా వారి పాఠశాల
పాఠశాల 2020-21 అడ్మిషన్లు ఘనంగా ప్రారంభం
అమెరికాలో 4దశాబ్దాలకుపైగా తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎల్లవేళలా తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తూనే ఉంది. తానా చేస్తున్న తెలుగు సేవలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను, వివిధ చోట్ల తెలుగును నేర్పించే బడులకు ప్రోత్సాహం, తెలుగు విద్యార్థులకు భాషా బోధనలో సహాయం, తెలుగు పుస్తకాల ప్రచురణ, గిడుగు రామ్మూర్తి పేరుతో భాషా ప్రముఖులకు అవార్డులు వంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తోంది. తెలుగు భాషను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తానా మహాసభల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ తెలుగు సాహిత్యానికి పెద్దపీట వేస్తోంది. విశ్వవిద్యాలయాల్లో తెలుగు కోర్సులకు ఆర్థిక సహాయం అందించి తెలుగు పీఠాలు నెలకొల్పడంలో సహాయపడుతోంది. అంతర్జాలంలో తెలుగు నిఘంటువు, తెలుగు కథలు, నాటకాలను ఆంగ్లంలోకి అనువదించడం వంటి కార్యక్రమాలను చేస్తోంది. మాతృరాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కుటుంబాల్లో తెలుగు భాషను నేర్చుకునేలా, వారిలో భాషా చైతన్యం తేవడంకోసం ఎల్లలు లేని తెలుగు పేరుతో తెలుగును బోధించడం వంటి చర్యలను చేపట్టింది. అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ను తానా సొంతగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాఠశాలను అమెరికా నలుమూలలా, తరువాత ప్రపంచమంతటా విస్తరించాలని తానా భావిస్తోంది. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలతో, ప్రణాళికలతో తానా ముందుకెళుతోంది. 2020-21 సంవత్సరపు అడ్మిషన్లను ఇటీవలనే ప్రారంభించింది.
ఆంధప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సూచించిన సిలబస్‌తో గత 6,7 సంవత్సరాలుగా సులభమైన పద్ధతితో, సరళమైన బోధనతో తెలుగును నేర్పిస్తూ, వారితో తెలుగులోనే మాట్లాడిస్తూ, వారి భాషా ప్రావీణ్యతను చాటేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరి ప్రశంసలను పాఠశాల అందుకున్న సంగతి తెలిసిందే. తానా తన విభాగంలో ఒక్కటిగా పాఠశాలను చేర్చుకుని 2020-21 విద్యా సంవత్సరంలో భాగంగా పాఠశాలలో పిల్లల అడ్మిషన్ పక్రియకు శ్రీకారం చుట్టింది. జూలై 19, ఆదివారంనాడు జూమ్ మీటింగ్ ద్వారా 2020-21 అడ్మిషన్ల పక్రియను ప్రారంభించారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి
తానా మొదటి నుంచి తెలుగుభాష పరిరక్షణకు, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాం స్కృతిక మహోత్సవం ప్రపంచమంతా తెలుగు భాష ఘనతను చాటేలా సాగింది. తెలుగు భాషా సంస్కృతి వైభవం ఉట్టిపడే విధంగా ‘‘సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగ మంజరి, నాదామ•తం, అందెలరవళి, కళాకృతి, రంగస్థలం, భువనవిజయం’’ వంటి ఎనిమిది విభాగాలలో 32 అంశాలలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో దాదాపు 18వేలమందికిపైగా తెలుగు వారు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను చాటారు. అలాగే ప్రపంచంలోని తెలుగు కవులను, కళాకారులను ప్రోత్సహించేందుకు ‘‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’’ ను ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలి అన్న ఆశయంతో కేవలం 100 డాలర్ల ఫీజుతో పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఎల్లలు లేని తెలుగు ఎప్పటికి వెలుగు అని 4 ఏళ్ళ క్రితమే తానా తెలుగు భాష కోసం ఉద్యమం మొదలు పెట్టింది. ఇప్పుడు పాఠశాల ద్వారా అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి తెలుగును నేర్పించే బాధ్యతను స్వీకరించింది. దాదాపుగా 42 కేంద్రాల్లో తానా పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 1000మంది విద్యార్థులతో 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అన్నీ నగరాల్లో అడ్మిషన్ల పక్రియ జరుగుతోంది.
తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ
పాఠశాల ఇప్పుడు అన్నీచోట్లా విస్తరించడంపైనే తానా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను చేస్తోంది. పాఠశాలను విజయవంతంగా నడిపించిన బే ఏరియా తెలుగు సంఘంవారు, మిగతా సెంటర్ల నిర్వాహకుల సహకారంతో ఇతర చోట్ల కూడా సెంటర్లను ప్రారంభించి విజయవంతంగా నడిపించనున్నది.
తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు
తానా పాఠశాల ఇప్పుడు అన్నీ చోట్లకు క్రమంగా విస్తరిస్తోంది. తెలుగు భాషను నేర్పించడానికి ముందుకు వస్తున్న తానా పాఠశాలకు అందరూ తమవంతు మద్దతు ఇవ్వాలి. తెలుగును వాడుకభాషగా అభివృద్ధి చేయాలంటే ప్రతి తెలుగు పిల్లవాడు తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలి. అందుకు పాఠశాల తోడ్పడుతుంది. తానా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాఠశాలలో పిల్లలు చేరేందుకు సహకరించాలి.
తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు
అమెరికాలో తెలుగువారి జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఎంతోమంది పిల్లలు తెలుగు భాషను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వారికి తెలుగు భాషను సరైన రీతిలో, ఆకట్టుకునే విధంగా బోధన చేసేవారు లేక వారు తెలుగు భాషను నేర్చుకోలేకపోతున్నారు. ఈ సమయంలో తానా పాఠశాల ద్వారా ఆ లోటును తీర్చనున్నది. వివిధ చోట్ల పాఠశాల కేంద్రాలను తానా సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసి మన పిల్లలకు తెలుగు భాషను నేర్పించనున్నది. లక్షలాది మంది ఉన్న అమెరికాలో తెలుగు భాషను నేర్చుకునేవారి సంఖ్య స్వల్పంగా ఉంది. దానిని మార్చేందుకు తానా సభ్యులు ప్రయత్నించాలి. పాఠశాల ద్వారా అందరికీ తెలుగు భాషను నేర్పించి, మన భాషా వైభవాన్ని చాటిచెప్పాలి.
తానా కార్యదర్శి రవి పొట్లూరి
పాఠశాలను తానా తీసుకున్న తరువాత వివిధ కార్యక్రమాలను నిర్వహించి పాఠశాల గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో పాఠశాల ఒక మంచి పరిణామం. తెలుగు నేర్పాలన్నదే ఒక మంచి ఆశయంగా ఇది ప్రారంభమైంది. ఈ సంవత్సరం 1000 మంది రావడం మొదటి మెట్టు మాత్రమే. నాయకులంతా అందరినీ ఎన్రోల్మెంట్ చేయించాలన్నారు. తానా మిడ్ అట్లాంటిక్ విభాగంలో పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలువురు పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు.
పాఠశాల కమిటీ చైర్ -నాగరాజు నలజుల
తానా పాఠశాల విభాగం చైర్‌గా ఉన్న నాగరాజు నలజుల మాట్లాడుతూ, ఈ సంవత్సరం పాఠశాల అన్నీ ప్రదేశాలలో ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తానా సభ్యులంతా ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు. అన్నీ ఏరియాలలో పిల్లలను చేర్పించే కార్యక్రమం కూడా ముమ్మరంగా జరుగుతోంది. టీచర్లకు, సెంటర్ కో ఆర్డినేటర్స్‌కు ఓరియంటేషన్ క్లాస్‌లు ఏర్పాటు చేసి, బోధనను మరింత సులువుగా చేయనున్నాము. విద్యార్థులు తెలుగును ఆడుతూ పాడుతూ చదవాలనే ఆకాంక్షను రేకెత్తించడమే పాఠశాల ప్రధాన ఉద్దేశ్యము. అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు చేస్తున్నాము.
చెన్నూరి వెంకట సుబ్బారావు, సిఇఓ పాఠశాల
అమెరికాలో పాఠశాలను ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను బహుకరించడం జరుగుతుంది. వసంతోత్సవం పేరుతో నిర్వహించే వార్షికోత్సవ వేడుకలు ఎంతోమందిని అలరిస్తుంటాయి. ఈ వేడుకలను చూడటానికి విద్యార్థుల తల్లితండ్రులే కాకుండా ఎంతోమంది వస్తుంటారు. ఇది పాఠశాల చేస్తున్న కార్యక్రమాల్లో హైలైట్‌గా నిలిచింది. విద్యార్థులకు తెలుగును సరళంగా, సులభంగా బోధించడమే పాఠశాల మొదటి నుంచి చేస్తున్నది. ఎన్నారై పిల్లలకు తగ్గట్టుగా ఆంధప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ సూచించిన సిలబస్‌ను ప్రవేశపెట్టి పాఠాలను బోధిస్తోంది. తానా ఆధ్వర్యంలో ఈ పాఠశాల అమెరికా అంతటా విస్తరిస్తోంది. ఎంతోమంది తెలుగు పిల్లలకు తెలుగు భాషను నేర్పించనున్నది. తెలుగువాళ్ళంతా తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలి.













