ట్రంప్‌పై భగ్గుమన్న మహిళలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన 575 మందిని యూఎస్ క్యాపిటల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్ట విరుద్ధంగా ఆందోళనకు దిగినందుకే వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ట్రంప్ వలస విధానాలు, మెక్సికో సరిహద్దు వద్ద కుటుంబాలను విడదీయడం వంటి చర్యలపై హార్ట్ సెనేట్ ఆఫీస్ భవనం ముందు వందలాది మంది ఆందోళన కారులు నిరసన చేపట్టారు. అక్రమంగా సరిహద్దు దాటివస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ తీసుకొచ్చిన జీరో టాలరెన్స్ విధానం పై వారంతా మండిపడ్డారు.
వాషింగ్టన్కు చెందిన కాంగ్రెస్ నేత ప్రమీలా జయపాల్ స్పందిస్తూ, అందరితో పాటు నన్ను కూడా అరెస్ట్ చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేశారో నాకు సృష్టంగా తెలియదు. కానీ అందులో 500 మందికి పైగా మహిళలే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అమానవీయమైన క్రూరమైన జీరో టాలరెన్స్ విధానంపై హార్ట్ సెనేట్ బిల్డింగ్ వద్ద జరిగిన ఆందోళనలో 500 మందికి పైగా మహిళలు ఉన్నారు. కుటుంబాలను విడదీయడం, చిన్నారులను నిర్బంధించడం, కేవలం బతుకుదెరువు కోసం వచ్చిన శరణార్థులను జైళ్లకు పంపడం దారుణం అని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతామనీ, ఈ నెల 30న మరోసారి వీధుల్లోకి వస్తామని ఆమె తెలిపారు.













