నదుల పునరుజ్జీవనానికి మద్దతుగా అగ్రరాజ్యంలో సువిధ ఇంటర్నేషనల్ కార్యక్రమాలు
భారత్‌లో నదుల పునరుద్ధరణకు సంబంధించిన ప్రాజెక్టులకు మద్దతిస్తూ అమెరికాలోని సువిధ ఇంటర్నేషనల్ పలు కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మూడు ‘రన్ ఫర్ వాటర్’ కార్యక్రమాలు జరిగాయి. శాక్రమెంటోలో 5 కిలోమీటర్ల నడక/పరుగు, ఆ తర్వాత ఫ్రెమాంట్లో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల నడక/పరుగు నిర్వహించారు. చివరగా వాషింగ్టన్‌లోని రెడ్మాండ్లో 5 కిలోమీటర్ల నడక/పరుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం సువిధ ఇంటర్నేషనల్.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఫ్రెమాంట్ రన్ కోసం సిలికాన్ వ్యాలీ గ్లోబల్ ఇంపాక్ట్ రోటరీ క్లబ్ ఈ సంస్థతో కలిసి పనిచేసింది. ఈ పరుగు కార్యక్రమాల్లో 500 మందికిపైగా స్థానిక ఎన్నారైలు పాల్గొని వీటిని విజయవంతం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబనను పెంపొందించడం కోసం సువిధా ఇంటర్నేషనల్ ఎంతో కృషి చేస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ వేంపటి ముందుండి ఈ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరుగు కార్యక్రమాల సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ రిప్రజంటేటివ్ పూజా గుప్త, సిలికాన్ వ్యాలీ గ్లోబల్ ఇంపాక్ట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాలీ పరీఖ్ ఇద్దరూ కూడా ప్రపంచంలో పెరుగుతున్న తాగునీటి సమస్యను ఎత్తిచూపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.













