అమెరికా వర్సిటీల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య
అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య గణాంకాలను అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం అమెరికాలో చదువుకునే మనవాళ్ల సంఖ్య వరుసగా ఆరో ఏడాదీ కూడా పెరిగింది. ‘2018-19 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు సష్టించింది. వీరిలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3 శాతం పెరిగింది” అని ‘ఓపెన్‌డోర్స్ నివేదిక-2019’ వెల్లడించింది. అమెరికాలోని ప్రతి ఐదుగురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారత్‌కు చెందినవారేనని తెలిపింది. ఆ నివేదిక ప్రకారం… అమెరికాలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో 2,02,014 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. 3,69,548 మంది విద్యార్థులతో చైనా వరుసగా పదో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానం భారత్‌కు దక్కింది.
అమెరికాలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 10,95,299గా ఉండగా వారిలో 50 మంది భారత్, చైనాకు చెందినవారే. గత ఏడాదితో పోలిస్తే మొత్తం విద్యార్థుల సంఖ్యలో 0.05 శాతం పెరుగుదల నమోదయింది. విదేశీ విద్యార్థుల ద్వారా అమెరికాకు ఏటా రూ.32,11,390 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ నివేదికను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని మినిస్టర్ కౌన్సిలర్ సి.ఫిలిప్స్ విడుదల చేశారు. ”భారత్‌లో ‘ఎడుక్యేషన్-యూఎస్ఏ’ కేంద్రాలు ఉన్నాయి. ఎనిమిదో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నామ”ని ఆయన వెల్లడించారు.
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళుతున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ జాబితాలో వరుసగా న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయీ రాష్ట్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకునేందుకు విద్యార్థులపై ఎక్కువ ఆర్థికభారం పడుతున్నప్పటికీ మంచి విశ్వవిద్యాలయాలు, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండటంతో చాలా మంది ఆ రాష్ట్రాన్ని రెండో ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు.













