ఓటర్లుగా చేరికకు ప్రవాస భారతీయుల ఆసక్తి
దేశంలో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ప్రవాస భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటున్న 24 వేల మందికి పైగా భారతీయులు ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 24,348 మంది ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 23,565 మంది కేరళీయులు, 364 మంది పంజాబీలు, 14 మంది గుజరాతీయులు ఉన్నారని ఓవర్సీస్ ఇండియన్ పోర్టల్ పేర్కొంది. ఒకసారి ఓటురుగా నమోదైన తర్వాత ప్రవాస భారతీయులు తాజా చిరునామాకు ఈ సమాచారాన్ని పోస్టు ద్వారా తెలియజేస్తారు. ఈ ఓటర్లకు ఎన్నికల సంఘం ఎలాంటి గుర్తింపు కార్డు జారీ చేయదు. ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన పాస్‌పోర్టును చూపించి ఓటు వేయాల్సి ఉంటుంది.













