శ్వేతజాతీయుల ర్యాలీలో హింస
అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని చార్టెట్విల్లే పట్టణంలో శ్వేతజాతీయులు, వారి వ్యతిరేకవర్గం పరస్పరం చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా 19 మంది గాయాలపాలయ్యారు. దీంతోపాటు ర్యాలీని పర్యవేక్షించేందుకు వచ్చిన ఓ హెలికాప్టర్ దురదృష్టవశాత్తూ కూలిపోవడంతో ఇద్దరు పోలీసు అధికారులు మృత్యువాతపడ్డారు. జాతీయవాదులు కాన్ఫడరేట్ జనరల్ రాబర్ట్ ఈ లీ విగ్రహాన్ని తొలగించడానికి వచ్చిన ఆ పార్కులో తిష్ట వేశారని శ్వేతజాతీయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్వేతజాతీయలకు వ్యతిరేకంగా జాతీయవాదులు శాంతియుత పద్ధతిలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారు వారిపైకి దూసుకెళ్లడంతో ఓ మహిళ (32)చనిపోగా 19 మందికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ జేమ్ ఫీల్డ్స్ (20)ను అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.













