కరోనాపై పోరాటంలో ట్రంప్ విఫలం : ఒబామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా మళ్లీ ధ్వజమెత్తారు. అయితే నేరుగా ట్రంప్ పేరు పెట్టి ప్రస్తావించకుండా, అనేక మంది తమను ఇన్‌చార్జీలుగా చెప్పుకుంటున్నా తామేం చేస్తున్నదీ వారికే తెలియదు అని ఒబామా అన్నారు. ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో పాల్గొన్న ఒబామా నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. పరిస్థితులు అన్నీ తలకిందులయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 75,000 మందికి పైగా అమెరికన్లు ప్రాణాలు తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు కూడా లేవని విమర్శించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ దారుణంగా విఫలం అయ్యారని ఒబామా మండిపడ్డారు. అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉందని తెలిపారు.






