డొనాల్డ్ ట్రంప్ పై ఒబామా ఆగ్రహం
నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా శత జయంతి వేడుకల్లో నిరంకుశ రాజకీయాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ధ్వజమెత్తారు. నేరుగా పేరు ప్రస్తావించకుండానే, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద విధానాలపై ఆయన చురకలు అంటించారు. జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా) లోని క్రికెట్ మైదానంలో కరతాళధ్వనుల నడుమ ఆయన ప్రసంగించారు. అధ్యక్ష పదవీ కాలం పూర్తయిన అనంతరం అంతర్జాతీయ వేదికపై ఆయన ఉద్వేగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. ప్రస్తుత మానవ హక్కులు, విలువలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ప్రపంచ ప్రజలు వీటిని గౌరవించాలని పిలుపునిచ్చారు. మండేలా అవిరామంగా పాటుపడిన సహనం, భిన్నత్వం, ప్రజాస్వామ్యం లాంటి అంశాలపై సజీవంగా ఉండేలా చూసేందుకు అందరూ కృషి చేయాలని అభ్యర్థించారు.
నేటి ప్రపంచం అనిశ్చితిలో కూరుకుపోతోంది. రోజూ వార్తల్లో తలతిరిగే శీర్షికలు చూడాల్సి వస్తోంది. చాలా దేశాలు మరింత ప్రమాదకర, దుర్మార్గమైన కాలంలోకి వెళ్లి పోతున్నట్లు మనం చూస్తున్నాం అని ఆయన వివరించారు. విద్వేష, నేలబారు, భయం పుట్టించే రాజకీయాలపై నాయకులను ఆయన తూర్పారబట్టారు. అసలు ఊహించలేని చోటుకు వీరు ప్రపంచాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.













