తెలుగు రాష్ట్రాల్లో ఎన్నారైవిఎ సేవలు… అధ్యక్షుడు శ్రీనివాసరావు పందిరి
ఎన్నారై వాసవి అసోసియేషన్ (ఎన్నారై విఎ) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఎన్నారై విఎ అధ్యక్షుడు శ్రీనివాసరావు పందిరి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి అసోసియేషన్ తరపున వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు 10నగరాల్లో, 30 వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటనల్లో భాగంగా 16 పాఠశాలల్లో పుస్తకమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి లైబ్రరీలకు పలు పుస్తకాలను అందించారు. పిల్లలు అన్నీరంగాలపై అవగాహన కలిగి ఉండేలా వివిధ రకాల సబ్జెక్టులతో ఉన్న పుస్తకాలను ఆయన లైబ్రరీలకు బహుకరించారు. దాదాపు 5,000 మంది పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పుస్తకపఠనం వల్ల ఎంత ప్రయోజనమో తెలియజెప్పారు. పుస్తకమిత్ర కో ఆర్డినేటర్ సిఎ ప్రసాద్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను కూడా ఆయన సందర్శించారు. టిబి బాధితులకోసం, కంటి వైద్య శిబిరంను ఆయన సందర్శించారు.
భద్రాచలంలోని శ్రీ రామచంద్రస్వామికి ఎన్నారై వాసవీ అసోసియేషన్ ద్వారా అందజేసిన బంగారుపూతతో కూడిన వాహనాలను ఆయన చూశారు. హైదరాబాద్‌లోని బొలారంలో టెన్నిస్ హార్డ్ కోర్ట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలను, గోశాలలను కూడా ఆయన సందర్శించారు. వివిధ దేవాలయాలను కూడా సందర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా అసోసియేషన్ సలహాదారులైన సన్యాసిరావుతోపాటు, డైరెక్టర్లు సంతోష్ మోరిశెట్టి, రవికాంత్ గార్లపాటి, ఫౌండేషనకు చెందిన లక్ష్మీనారాయణ పంతంగి తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నారైవిఎ ద్వారా మరిన్ని కార్యక్రమాలు, కమ్యూనిటీకి ఏ విధంగా సహాయపడగలమో తదితర వివరాలను వారితో చర్చించారు. తన భారతదేశ పర్యటన ఎంతో సంతృప్తినిచ్చిందని, ఎన్నారై విఎ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామని ఆయన పేర్కొన్నారు.













