విజయవంతమైన ఎన్నారైవిఎ భారత్ సేవ 2024
అమెరికాలోని ఎన్నారై వాసవీ అసోసియేషన్ వారు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారత్ సేవ 2024 పేరుతో జనవరి 16 నుంచి జనవరి 27వ తేదీ వరకు 8 నగరాల్లో దాదాపు 16 రోజులపాటు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు పందిరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిర్విరామంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి తెలుగు ప్రజల మన్ననలను అందుకున్నారు. ఖమ్మం, వరంగల్, విజయవాడ, చీరాల, పెనుగొండ, అనకాపల్లి, అనంతపురం, హైదరాబాద్‌లలో వారు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. ఎన్నారై వాసవీ అసోసియేషన్ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కింద సహాయ కార్యక్రమాలను ఈ భారత్ సేవా కార్యక్రమంలో చేశారు.
ఈ సందర్భంగా ఎన్నారైవీఎ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పందిరి ‘తెలుగు టైమ్స్’తో మాట్లాడుతూ, ‘ఎన్నారైవీఏ భారత్ సేవ కార్యక్రమం ఘనవిజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దక్షిణ భారతదేశంలో వివిధ కమ్యూనిటీల్లో సాధికారత పెంచేందుకు మొదలు పెట్టిన ఈ కార్యక్రమం గొప్ప ఫలితాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. చౌడవరంలో యువతుల శక్తిని మెచ్చుకుంటూ ప్రారంభించిన ‘షీరోస్’ నుంచి ఖమ్మం, ఇతర నగరాల్లో చేసిన సేవల కార్యక్రమాలు ఎన్నారై విఎ చేస్తున్న సేవను అందరికీ తెలియజేసింది.
పుస్తక మిత్ర కార్యక్రమంలో పుస్తకాలు అందుకున్న చిన్నారుల పసిడి నవ్వులు, మెడికల్ క్యాంపుల ద్వారా లబ్దిపొందిన వారి కళ్లలో ఆనందం.. ఇవన్నీ జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ సేవా ప్రయాణంలో నా సహచరులు ప్రెసిడెంట్ ఎలెక్ట్ బాపనపల్లి రమేష్, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ డాక్టర్ రాములు సముద్రాల, డాక్టర్ సుశీల సముద్రాల, రీజనల్ డైరెక్టర్ రజనీ కొప్పరపు ఇతరులు ఇచ్చిన సహకారం, సహాయం వల్ల ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సేవలో నాకు తోడునీడుగా ఉన్న నా సతీమణి ఉమ సహకారం కూడా మర్చిపోలేను. ఎన్నారై విఎ వాలంటీర్ల కృషిని కూడా మరువలేమని అంటూ, ఈ కార్యక్రమాలన్నీ విజయవంతానికి వారితోపాటు దాతలు, ఇతరులు మద్దతు ఇచ్చారని ఆయన అంటూ ఇదే స్ఫూర్తితో జూలై 4 నుంచి 6 వరకు సెయింట్ లూయిస్ లో జరిగే ఏడవ అంతర్జాతీయ కన్వెన్షన్ కూడా విజయవంతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భారత సేవ కార్యక్రమాల్లో హైలైట్స్‌గా నిలిచిన కార్యక్రమాల వివరాలను సంక్షిప్తంగా ఇక్కడ ఇస్తున్నాము.
పుస్తక మిత్ర
ఎన్నారై విఎ వారు పుస్తకమిత్ర ప్రాజెక్టులో భాగంగా వివిధ చోట్ల ఉన్న పదహారు స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడమే కాకుండా ఆయా పాఠశాలల్లో స్టేషనరీ వస్తువులు, బెంచ్‌లు, మంచినీళ్ల బాటిల్స్, ఫిల్టరేషన్ వ్యవస్థలను అందజేశారు.
ఏఏఎస్
అడాప్ట్ ఎ స్టూడెంట్ కార్యక్రమం కింద 256 మంది వీర మహిళల గాధలను వివరించే ‘షీరోస్’ పుస్తకాన్ని గుంటూరు సమీపంలోని చౌడవరంలో ఆవిష్కరించారు.
ఈ ప్రాజెక్టు కింద వివిధ చోట్ల నాలుగు కంప్యూటర్ డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబులను ప్రారంభించారు. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ తదితర సబ్జెక్టుల కోసం 1200 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా సైన్స్ రీసెర్చ్ ల్యాబులను ఏర్పాటు చేశారు. బాలికల స్కూల్లో మూడు మహిళా సాధికారత సెషన్స్ నిర్వహించారు. 40 మందికిపైగా ఏఏఎస్ లబ్దిదారులైన విద్యార్థులను కలిశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ డిగ్రీలు చదవాలని అనుకుంటున్న విద్యార్థులకు కోసం విరాళాలు అందజేశారు.
ఏఏవీ
అడాప్ట్ ఎ విలేజ్ కార్యక్రమం కింద ఖమ్మంలో 150 మందికి కృత్రిమ అవయవాలను అందజేశారు.
వివిధ చోట్ల మూడు మెడికల్, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించారు. వీటిలో 600 మంది పరీక్షలు చేయించుకున్నారు.
పాడేరు గ్రామంలో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం విరాళం అందజేశారు.
నర్సీపట్నంలో అగ్నిప్రమాదంలో ఇంటిని కోల్పోయిన ఒక కుటుంబానికి రూ.లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు.
మానసిక ఆరోగ్యం లేని పురుషుల కోసం ఏర్పాటు చేసిన ‘మాతృదేవో భవ’ అనాథ శరణాలయంలో ఆఫీస్ సదుపాయాలు, క్లినిక్, సంప్ పంప్, వేస్ట్ మేనేజ్మెంట్ కోసం విరాళం అందజేశారు.
ఏఏపీ
అడాప్ట్ ఎ పేరెంట్ కింద 200 మందికిపైగా వృద్ధులకు పెన్షన్ అందజేశారు.
గోమాత
ఎన్నారై విఎ ప్రవేశపెట్టిన గోమాత కార్యక్రమంలో భాగంగా గోవుల రక్షణ కోసం 9 గోశాలలను వివిధ చోట్ల ఏర్పాటు చేయించారు.
హిందూ ధర్మ సేవ
హిందూ ధర్మానికి మద్దతుగా 9 ఆలయాలు, వేదిక్ సెంటర్లకు విరాళాలు అందజేశారు.
వాసవీ మాత జన్మస్థలం, ఆలయాన్ని సందర్శించి అక్కడ అఖండ జ్యోతి ఏర్పాటుకు చర్చలు జరిపారు.
ఎన్నారైవీఏ పేరెంట్స్ నెట్వర్క్
ఎన్నారైవీఏ డేస్‌లో భాగంగా 8 పట్టణాల్లో ఎన్నారైవీఏ సభ్యుల తల్లిదండ్రులను కలవడంతోపాటు ఎన్నారై కుటుంబాల తల్లిదండ్రులను కలుపుకొని పోయేందుకు వీలుగా ఎన్నారైవీఏ పేరెంట్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడం జరిగింది.
వివిధ నాయకులతో సమావేశాలు…ఆహ్వానాలు
భారత్ సేవ కార్యక్రమాలు ముగిసిన పిదప సెయింట్ లూయిస్‌లో జరిగే ఎన్నారైవీఏ 2024 కన్వెన్షన్ కోసం వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని ఎన్నారై విఎ నాయకులు స్వయంగా ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీ వెంకటేశ్, ఎమ్మెల్సీ దయానంద బొగ్గారపు, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మహేష్ బిగాల, మహాసభ ప్రెసిడెంట్ అమరావది, తదితర రాజకీయ నాయకులను, అలాగే హైదరాబాద్ సహా 8 నగరాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలను కలిసి ఆహ్వానించడం జరిగింది.







