బే ఏరియాలో ఎంవీవిఎస్ మూర్తికి ఎన్నారైల నివాళి
గీతం విద్యాసంస్థల అధినేత, తెలుదశం నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి సంస్మరణార్థం అమెరికాలోని గీతం పూర్వ విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తర అమెరికా గీతం పూర్వవిద్యార్థుల అసోసియేషన్(గానం) ఆధ్వర్యంలో ఎంవీవీఎస్ మూర్తి సంస్మరణ సభ జరిగింది. అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మత్యువాత పడిన ఎంవీవీఎస్ మూర్తితోపాటు, వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరిల గురించి గీతం పూర్వ విద్యార్థులు జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 200కుపైగా గీతం పూర్వవిద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. ఫ్రీమాంట్ సిటీ మేయర్ లిలీ మీయి కూడా హాజరయి సంతాపాన్ని తెలియజేశారు. గీతం కుటుంబానికి సన్నిహితులైన ఉత్తర అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఏపీఎన్నార్టీ బృందం, బాటా ఎగ్జిక్యూటివ్ బృందం, తానా, ఎన్నారై టీడీపీ సభ్యులు పాల్గొని వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గానం అధ్యక్ష కార్యదర్శులు రవి పాపోలు, కామేష్ మల్లాలు ఈ సంస్మరణ సభకు ప్రారంభోపన్యాసం చేశారు. గడిచిన కొన్ని వారాలుగా మూర్తి, ఇతర ముఖ్యవ్యక్తులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘గానం’ ఏర్పాటులో వారు చూపిన ఆసక్తి, ఉత్సాహాన్ని ఈ సందర్భంగా ఆహూతులకు వివరించారు. ఏ ఆశయాలతో అయితే గానం స్థాపించారో వాటిని సాకారం చేయడానికి తమవంతు కషిచేస్తామన్నారు. ఏపీలో పేరోందిన విద్యాసంస్థగా ఎదిగిన గీతంతో అనుబంధం ఉండటం తమకెంతో గౌరవం తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు, ఇతర ప్రముఖలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.
టెక్సాస్ నుంచి అధ్యక్ష, కార్యదర్శులులైన విక్రాంత్, ప్రసాద్ గుజ్జు హాజరయి ఎంవీవీఎస్ మూర్తికి నివాళులు అర్పించారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖులతో తమకున్న అనుబంధాన్ని జయరాం గుర్తు చేసుకున్నారు. గానం ఏర్పాటు మూర్తి, పున్నయ్యల సహకారం గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.. ఎంవీవీఎస్ మూర్తితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తోటకూర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. సంక్షిప్త బయోగ్రఫీలను అందజేశారు. పూర్వపు ఫ్యాకల్టీ సభ్యులు నాగవల్లి, రవి కర్రి, నరసింహరావు గీతంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ సంతాపాన్ని తెలియజేశారు. గానం ప్రారంభ వేడుకల్లో మూర్తి, బసవపున్నయ్యలు అనుకున్నారనీ, కానీ ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం తమను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిమాన నాయకుల అంతిమ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు తాము ప్రయత్నిస్తామని గానం సభ్యులు ప్రతిజ్ఞచేశారు.













