తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఎన్నారైలు
2003లో తెలుగు టైమ్స్ ప్రారంభించే సమయంలో, ప్రారంభించిన వెంటనే… మన ఎన్ఆర్ఐ లకు ఏ వార్తలు ఎక్కువ నచ్చుతాయి? అని చాలా వివరంగా పరిశీలించాము. ఎక్కువమందికి కావలసిన రెండు సబ్జక్ట్స్ – పాలిటిక్స్, సినిమాగా గుర్తించి వాటిని తెలుగు టైమ్స్‌లో చేర్చడం జరిగింది. అయితే ఈ 20 ఏళ్లలో ఆ ఇంట్రెస్ట్ మరింత బాగా పెరిగిందనే చెప్పాలి.
అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర – తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిశితంగా గమనిస్తూ, తమ రాష్ట్రంలో లేదా జిల్లాలో లేదా తమ గ్రామంలో రాజకీయాలతో అనుబంధం పెంచుకొనే ఎన్ఆర్ఐల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇక్కడే (అమెరికాలో) ఉంటూ తమ ఊరి / లేదా జిల్లా రాజకీయ మార్పులు గమనిస్తూ తమ బంధువులు, మిత్రులు ద్వారా వాటిని కొంచెం ప్రభావితం చేస్తూ ఉండే వారు ఒక టైపు అయితే, ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా తమ ప్రదేశాలకు వెళ్లి ఎన్నికల కోలాహలంలో పాల్గొని వచ్చే వారు ఇంకో టైపు. అయితే ఈ రెండు టైప్ మనుషుల కంటే ఎక్కువగా తమ జిల్లాకు (లేదా తమ నియోజక వర్గం) పూర్తి స్థాయిలో కనెక్టు అయి, అక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే 3వ టైప్ ఎన్నారైలు కూడా అమెరికాలో బానే పెరుగుతున్నారు.
ఈ విధంగా అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం ఇప్పటి విషయం కాదు 1996లో లోక్‌సభ ఎన్నికల్లో హౌస్టన్ నుంచి జి. ఆత్మచరణ్ రెడ్డి నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మెంబర్ అఫ్ పార్లమెంట్ (ఎంపీ)గా గెలిచి 5 సంవత్సరాల రాజకీయ (ప్రజా) జీవితం గడిపారు. అలాగే న్యూ జెర్సీలో వ్యాపారాలు వున్న మధు యాష్కీ 2004 మరియు 2009 లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి రెండు సార్లు ఎంపీగా ప్రజా సేవ చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్‌గా క్రియాశీలక పదవిలో చురుగ్గా పని చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక, అట్లాంటా నుంచి వెళ్లిన మధు తాతా టిఆర్ఎస్ పార్టీ (ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ)లో చురుగ్గా పాల్గొని ఎమ్మెల్సీగా కౌన్సిల్‌కి ఎన్నికైనారు.
కాలిఫోర్నియా నుంచి మాజీ తానా అధ్యక్షులు జయరాం కోమటి 2007 నుంచే ఎన్నారై టీడీపీ కో ఆర్డినేటర్‌గా చురుగ్గా తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తున్నారు. 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎపిఎస్ఆర్ఎన్ఎ (ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా)గా ఉంటూ ప్రభుత్వానికి ఎన్నారై కమ్యూనిటీకి వారధిగా ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చేశారు. అదే సమయంలో టెక్సాస్ రాష్ట్రంలో డాక్టర్‌గా, బిజినెస్‌మాన్‌గా బిజీగా వున్న డాక్టర్ రవి వేమూరు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి ఎపిఎన్ఆర్టీఎస్ (ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ)ని ప్రారంభించడంలోను, సమర్ధవం తంగా నడపటంలో ఏంతో పేరు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం జయరాం కోమటి, డా. రవి వేమూరు కూడా చురుగ్గా తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో ఉంటూ అందరికీ మార్గదర్శకం చేస్తున్నారు.
ప్రస్తుతం ఏం జరుగుతోంది?
2014 నుంచి 2019 ఎన్నికల వరకు, 2019 నుంచి 2023 వరకు జరిగిన/జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే.. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నారైలు తమ ఉద్యోగాలు – వ్యాపారాలు, అమెరికా జీవితాలు పక్కన పెట్టి, ఆంధ్ర – తెలంగా ణలో జరిగే ఎన్నికల బరిలోకి దూకటానికి సిద్ధంగా వున్నారు. చాలామంది వారి వారి నియోజకవర్గంని ఎంచుకోవడం, పార్టీ అధినేతలు లేదా పెద్దవారిని కలుసుకోవడం, ఎన్నికల్లో నిలబడితే అయ్యే ఖర్చుని అంచనా వేసుకోవడం చేస్తున్నారు. కొందరు ఇప్పటికే తాము ఎంచుకున్న నియోజకవర్గంకి వెళ్లి ఒక ర్యాలీ ఈవెంట్ చేయడమో, లేదా కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్రారంభించడమో కూడా చేసేసి తమ ఉనికిని, కోరికను పార్టీ నాయకులకు, మీడియాకు, ప్రజలకు చెప్పడం కూడా చేస్తున్నారు. అందులో కొందరికి ఆయా పార్టీల నుంచి అభ్యర్థిగా నిర్ధారించినట్టుగా హామీలు కూడా వచ్చాయని ప్రచారం జరుగుతోంది.
తెలుగు టైమ్స్ పాత్ర ఏమిటి?
మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉండే పార్టీలకుగాని, అమెరికాలో వున్న తెలుగు గ్రూప్స్‌కి గాని సంబంధం లేకుండా కేవలం ఒక పత్రికగా తెలుగు టైమ్స్ తన పాత్ర పోషిస్తోందని అందరికి తెలుసు. ఇప్పుడు కూడా పెరుగుతున్న రాజకీయాల్లోకి వెళ్ళాలనుకొనే ఆసక్తిదారులందరికి శుభాకాంక్షలు చెపుతూ, ఆగస్టు 1న వెలువడే తెలుగు టైమ్స్ సంచిక (1 ఆగష్టు 2023) నుంచి ‘‘ఎన్నికలలో ఎన్నారైలు’’ అనే శీర్షికను ప్రారంభిస్తున్నాము. ఈ శీర్షికలో ఆశావహులు గురించి వివరంగా రాద్దామని, వారి బలాలు, వారి లక్ష్యాలు అందరికి వివరిస్తున్నాము.
ఇక్కడ రెండు రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. ఒక వర్గం తమ ఆలోచనను, తమ అభ్యర్థిత్వం చెప్పాలని – అందు వలన తమకు అందరి నుంచి మద్దతు లభిస్తుందని అనుకొంటున్నారు. ఇప్పుడే ఎవరికీ చెప్పకూడదు అని, చెపితే తమకు పార్టీలో సెలక్షన్ టైంలో ఇబ్బందులు వస్తాయి అనుకొనే ఇంకొక వర్గం కూడా వున్నారు. రెండు అభిప్రాయా లను మేము గౌరవిస్తూ మాకు మీనుంచి సరి అయిన ఇన్ఫర్మేషన్ రావాలని ఆశిస్తున్నాము అమెరికాలో 20 ఏళ్ల నుంచి తెలుగు వారితో కలిసి జీవిస్తున్న తెలుగు పత్రికగా తెలుగు టైమ్స్ తన మీడియా పాత్ర సమర్ధవంతంగా నిర్వహించాలని అనుకొంటుంది. అభ్యర్థులు కానీ, వారి మిత్రులు, శ్రేయోభిలాషులు వెంటనే నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.
Venkata Subba Row Chennuri
Editor -Telugu Times
Ph: +1 317 544 9122
email: editor@telugutimes.net
OR: subbarow.chennuri@gmail.com













