డిజిటల్ తరగతి గదుల కోసం ఎన్నారైల విరాళం రూ.30 లక్షలు – జయరాం కోమటి
రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు ఎన్నారైలు ముందుకు వచ్చారని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్‌లో చైర్మన్ బాపిరాజు, ఎమ్మెల్సీ రాము సూర్యారావుతో కలిసి జయరామ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ డిజిటల్ క్లాస్‌రూమ్‌లతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 5,430 ప్రభుత్వ హైస్కూల్స్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.
జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసేందుకు ఎన్నారైలు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు ఈ విధంగా ముందుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ క్లాస్‌రూములు ఏర్పాటుకు రూ.30 లక్షల రూపాయలు చెక్కును జయరామ్ జిల్లా కలెక్టర్‌ను కలిసి అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నారైల నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.













