జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన బే ఏరియా ఎన్నారైలు
రాష్ట్రపతికి కాన్సులేట్ ద్వారా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఎన్నారైలు తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ వారు బే ఏరియా ప్రముఖుల్లో ఒకరిగా ఉన్న జయరామ్ కోమటి ఆధ్వర్యంలో 4 బస్సులలో వందలాదిమంది ఊరేగింపుగా వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ సంజయ్ పాండాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అమరావతిలో జరుగుతున్న ఘోరాలను, ప్రభుత్వాలను నమ్మి తమ భూములు ఇచ్చినందుకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి బే ఏరియా నుంచి అమరావతి రైతుల తరఫున వీరంతా పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివెళ్లారు. సుమారు నాలుగు పెద్ద వాహనాల్లో వందలాది మంది కాన్సుల్ జనరల్ అపాయింట్మెంట్ తీసుకుని అమరావతి పరిస్థితి వివరించారు. ఈ కాన్సుల్ జనరల్ ద్వారా అమరావతి రైతుల బాధను, ఆవేదనను… ప్రభుత్వ నిరయం వల్ల కలుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ఒక మెమొరాండం తయారుచేశారు. దీనిని కాన్సుల్ జనరల్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. కాన్సుల్ జనరల్ సంజయ్ పాండా మాట్లాడుతూ, ఎన్నారైలు ఇచ్చిన వినతిపత్రాన్ని కేంద్రంలోని ఉన్నత అధికారులకు పంపిస్తామని చెప్పారు. ఎన్నారైల మాటను కూడా వారికి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.
అమరావతిలో రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులు, వాళ్ళ కుటుంబంపై, ఆందోళన చేస్తున్న మహిళలపై, పిల్లలపై, వద్ధులపై ప్రభుత్వం పోలీసులతో చేస్తున్న దమనకాండను వారు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు తమ వినతిపత్రంలో కోరారు. రైతులు చేసిన తప్పు రాజధాని నిర్మాణానికి కానీ ఖర్చులేకుండా భూములు ఇచ్చేయడం. పోనీ ఇచ్చిన భూమికి పరిహారం రాదు. ఇచ్చిన మొత్తం తిరిగి కూడా రాదు. రూపాయి భూమి ఇస్తే కేవలం పావలా భూమి మాత్రమే తిరిగి వస్తుంది. అయినా… వారు మా విలువ మాకు వస్తుంది… రాష్ట్రానికి మార్గం చూపిన వాళ్లం అవుతామని త్యాగాలకు సిద్ధమైతే వారి తలరాతలను, రాష్ట్ర భవిష్యత్తును చిదిమివేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని, ఇందులో జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయమని వారు రాష్ట్రపతికి ఇచ్చిన మెమొరాండంలో కోరారు. ఈ కార్యక్రమంలో జయరామ్కోమటితోపాటు, వెంకట్ కోగంటి, భక్తబల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్నారైలు తరలిరావడం విశేషం.













