కరోనా బాధితులకు సహాయం అందిస్తున్న వంశీరెడ్డి

తెలంగాణలో కోవిడ్ బాధితుల కోసం ఆపన్నహస్తం అందించేందుకు ఎంతోమంది ఎన్నారైలు, తెలుగు సంఘాలు ముందుకు వస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఎన్నారై వంశీ రెడ్డి కరోనా బాధితుల కోసం 5 ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లను ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లా రెడ్‍క్రాస్ సొసైటీకి అందజేశారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ), వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్‍లో ముఖ్య పాత్ర పోషిస్తున్న వంశీరెడ్డి కరోనా బాధితుల సహాయ సేవల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఎన్నారైలు జిల్లాకు ఇలాంటి సమయంలో ముందుకువచ్చి చేయూతనివ్వడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ కొనియాడారు.
కరోనా విపత్తు సమయంలో రెడ్‍క్రాస్ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. రక్తానికే పరిమితం కాకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని, తాను రెడ్‍క్రాస్ సభ్యులుగా ఉండడం గర్వంగా ఉందన్నారు. కరోనా బాధితుల కొరకు ఐదు ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లను అందజేసిన దాతలు వంశీరెడ్డితోపాటు, డిట్రాయిట్ ఎన్‍ఆర్‍ఐ ఎం. సుదర్శన్‍రెడ్డిలు రూ.లక్ష 70 వేల విలువ గల మెడికల్ కిట్లు ఉచితంగా అందించడం వారి సహృదయానికి నిదర్శనమన్నారు. కొవిడ్ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు రెడ్‍క్రాస్ సేవలను కొనియాడారు.