మే 27, 28 తేదీల్లో డల్లాస్ లో తెలుగు దేశం పార్టీ మహానాడు
అమెరికాలోని డల్లాస్ వేదికగా ఎన్.ఆర్.ఐ. టీడీపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మహానాడును నిర్వహిస్తున్నారు. డల్లాస్‌లోని మార్థామస్ ఈవెంట్ సెంటర్లో మే 27, 28 తేదీల్లో ఈ మహానాడు జరుగుతుంది. మే 27 మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు జరుగుతాయి. మే 28వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహానాడు జరుగుతుంది.
ఈ మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లను, ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేసేందుకు అమెరికాలో ఎన్నారై టీడిపి నాయకుడు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ విజయవాడకు వచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వారు కలుసుకుని ఆహ్వానపత్రికను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఐ. టీడీపీ తరఫున నిర్వహిస్తున్న మహానాడు ఏర్పాట్లను వారు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటిసారిగా అమెరికాలో రెండురోజులపాటు మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహిస్తున్నామని, ఇందులో ఎన్.ఆర్.ఐ. టీడీపీ సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇతరులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ మహానాడుకు తెలుగుదేశం నాయకులను పంపాలని వారు సీఎంకు విజ్జ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అమెరికా అభివృద్ధిలో తెలుగు ఎన్.ఆర్.ఐ.ల భాగస్వామ్యం ఎనలేదని ప్రశంసించారు. అమెరికాలోని తెలుగుప్రజలందరినీ మహానాడు వేదికగా ఐక్యపరుస్తున్నందుకు ఎన్.ఆర్.ఐ. టీడీపీ సభ్యులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ నేతలను పంపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరు మాజీ జడ్పి చైర్మన్ పాతూరి నాగభూషణం, పార్లమెంట్ సభ్యుడు సిఎం. రమేష్, టీడీపి నాయకురాలు ముళ్ళపూడి రేణుక, డా.గల్లా రమాదేవి, ఎమ్మెల్యే కదిరి బాబురావు ఈ మహానాడుకు రానున్నారు.
మహానాడు వేదికగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని అమెరికాలోని తెలుగు ఎన్.ఆర్.ఐ.లకు వివరించాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి రుణం తీర్చుకునేలా, ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా తెలుగు ఎన్.ఆర్.ఐ.లలో చైతన్యం తేవాలన్న తన సందేశాన్ని కూడా వినిపించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో జయరాంతోపాటు తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా ఉన్నారు.
మహానాడు కోసం వివిధ కమిటీలు
డల్లాస్‌లో జరిగే మహానాడు కోసం ఎన్నారై టీడిపి నాయకులు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.
నేషనల్ అడ్వయిజరీ కమిటీలో జయరామ్ కోమటి, సతీష్ వేమన, మోహనకృష్ణ మన్నవ, డా నవనీత కృష్ణ, డా. రాఘవేంద్ర ప్రసాద్ ఉన్నారు.
ఓవర్‌సీయింగ్ కమిటీలో శ్రీని మండవ, మురళీ వెన్నం, చలపతి కొండ్రకుంట, కిషోర్ కంచర్ల, వెంకట్ కొల్లి, సుగన్ చాగర్లమూడి, అనిల్ వీరపనేని, సురేష్ మండువ ఉన్నారు.
ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ టీమ్‌లో లోకేష్ నాయుడు కొణిదెల, సాంబ దొడ్డ, వేణు పావులూరి, సుధాకర్ కంచర్ల, అజయ్ గోవద, చంద్రారెడ్డి పోలీస్, జనార్థన్, కిషోర్ చలసాని ఉన్నారు.
అమెరికాలో జరిగే ఈ మహానాడుకు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు వస్తున్నారని, అమెరికాలో ఉన్న తెలుగు దేశం పార్టీ అభిమానులంతా ఈ మహానాడుకు తరలిరావాలని ఎన్నారై టీడిపి నాయకులు కోరారు. మహానాడులో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. గాయని కౌసల్య, గాయకుడు సింహల సంగీత విభావరి ఉంటుందని, శ్రీలక్ష్మీ, సందీప్ ఈ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. వచ్చినవాళ్ళకు మంచి ఆతిధ్యం కూడా ఏర్పాటు చేసినట్లు ఎన్నారై టీడిపి నాయకులు పేర్కొన్నారు.













