డల్లాస్ లో రెండు రోజులపాటు ‘మహానాడు’
ఎన్.ఆర్.ఐ. టీడీపీ సభ్యులను అభినందించిన సీఎం చంద్రబాబు
అమెరికాలోని డల్లాస్ వేదికగా ఎన్.ఆర్.ఐ. టీడీపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పెద్దెత్తున మహానాడు జరగనుంది. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎన్.ఆర్.ఐ. టీడీపీ తరఫున తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, నాట్స్ అధ్యక్షులు మోహన్ కృష్ణ, తెలుగుటైమ్స్ పత్రిక ఎడిటర్ సుబ్బారావు చెన్నూరిలు కలిసి డల్లాస్ లో నిర్వహించనున్న మహానాడు విశేషాలను వివరించారు.
మొదటిసారిగా అమెరికాలో రెండురోజులపాటు మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహిస్తున్నారు. ఎన్.ఆర్.ఐ. టీడీపీ సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొంటున్నట్లు సీఎంకు జయరాం వివరించారు. డల్లాస్ లో జరిపే మహానాడుకు తెలుగుదేశం నేతలను పంపాలని సీఎంకు విజ్జ్ఞప్తి చేశారు. అమెరికా అభివృద్ధిలో తెలుగు ఎన్.ఆర్.ఐ.ల భాగస్వామ్యం ఎనలేదని సీఎం ప్రశంసించారు. అమెరికాలోని తెలుగుప్రజలందరినీ మహానాడు వేదికగా ఐక్యపరుస్తున్నందుకు ఎన్.ఆర్.ఐ. టీడీపీ సభ్యులను సీఎం చంద్రబాబు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ నేతలను పంపిస్తామని సీఎం చంద్రబాబు ఎన్.ఆర్.ఐ. టీడీపీ సభ్యులకు హామీ ఇచ్చారు. మహానాడు వేదికగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని అమెరికాలోని తెలుగు ఎన్.ఆర్.ఐ.లకు వివరించాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి రుణం తీర్చుకునేలా, ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా తెలుగు ఎన్.ఆర్.ఐ.లలో చైతన్యం తేవాలన్న తన సందేశాన్ని వినిపించాలని కూడా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.













