టీడీపీదే భవిష్యత్తు… బే ఏరియా శ్రేణుల ధీమా !!

సమస్య ఎదురైన సమయంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగి విజయతీరాలకు చేరడం తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. రామన్న ఏర్పాటు చేసిన పార్టీ…చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ అయిన తెలుగుదేశం శ్రేణులు గెలుపునకు పొంగిపోవడం, ఓటమికి కుంగిపోవడం అనే తీరుకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నాయి. ఇటీవల ఎన్నికల ఫలితాలను సమీక్ష చేసుకొని రాబోయే కాలంలో జరగబోయే ఎన్నికల్లో పచ్చ జెండాను ఎగురవేస్తాయని స్పష్టం చేశాయి.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావులకు బే ఏరియాలో తెలుగుదేశం పార్టీ బే ఏరియా నేతలు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్‌లో ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి-సంక్షేమం జోడెద్దులుగా పరిపాలన అందించిందని తెలిపారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కుట్ర, స్వార్థం, సాంకేతిక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిందని అన్నారు. రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, యువనేత నారా లోకేష్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఆరునెలల సమయం ఇచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ పరిపాలనపై పూర్తి స్థాయిలో స్పందిద్దామని పేర్కొన్నారు. ఎన్నారైల ఉత్సాహం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం పక్కా అని నక్కా ఆనంద్‌బాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జయరాం కోమటి, వెంకట్ కోగంటి, సుబ్బా యంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, భరత్, లక్ష్మీపతి గడిరాజు, ప్రసాద్ మంగిన, Yaswant Kudaravalli, గుమ్మడి కృష్ణ, శివ మలాడి తదితరులు పాల్గొన్నారు.