డల్లాస్ లో ఘనంగా చంద్రబాబు అమెరికా యాత్ర విజయోత్సవం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల అమెరికాలో చేసిన వారం రోజుల పర్యటన విజయవంతం అయిన సందర్భంగా డల్లాస్ ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో ప్లేనోలోని బావర్చి సమావేశ మందిరంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇటీవల మరణించిన తెదేపా నేతలు దేవినేని రాజశేఖర్(నెహ్రూ), భూమా నాగిరెడ్డిలకు ప్రవాసులు నివాళులు అర్పించిన అనంతరం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. సభలో పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ మాతృభూమికి సేవ చేస్తూ, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా కేవలం పార్టీ బలోపేతానికి ఎన్నారై టీడీపీ విభాగం పనిచేస్తుంది అన్నారు. మేధావులు, విద్యావంతులు, ధనికులు, విజ్ఞానులతో నిండు కుండగా భాసిల్లే ప్రవాస తెదేపా విభాగాలు కేవలం పార్టీ మనుగడకు, జన్మభూమి అభివృద్ధికి మాత్రమే పనిచేస్తాయని పేర్కొన్నారు.
ప్రవాస తెలుగుదేశం విలువను గుర్తించిన చంద్రబాబు ఎన్నారై టీడీపీతో సమావేశాన్ని గంటా 40నిముషాల పాటు కొనసాగించి తాను కార్యకర్తలు చెప్పేది వినే నాయకుడిగా నిరూపించుకున్నారని ప్రవాసులు కొనియాడారు. డల్లాస్ ఎన్నారై టీడీపీ రగిల్చిన స్ఫూర్తితోనే చంద్రబాబు శాన్హోశే-చికాగో సభల్లో ఏపీ ఎన్ఆర్టీ, ఏపీ జన్మభూమి తదితర ప్రభుత్వ విభాగాలను ప్రవాస తెలుగుదేశంతో అనుసంధానం చేసేందుకు ఆలోచనలను రూపొందించుకున్నారని సభికులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ వేడుకలకు పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ప్రవాసుడు టీ.నర్సాపురం జడ్పీటీసీ నల్లూరి చలపతిరావులు పాల్గొని ఎన్నారై టీడీపీ కార్యక్రమాలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రవాస తెలుగుదేశం కార్యకర్తలు డా.సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్, కొండ్రుకుంట చలపతి, అమర్ అన్నే, శేఖర్ అన్నే, జనార్దన్,సుమంత్, రాము నార్నె, కేసీ చేకూరి, లోకేష్నాయుడు, కిషోర్ చలసాని, పోలవరపు శ్రీకాంత్, పొట్లూరి రవి, వల్లేటి వెంకట్, డా.సుబ్బరాయ చౌదరి, శ్రీనివాసరావు కొమ్మినేని, అనీల్ వీరపనేని, చంద్ర పోలీస్, ఇంద్రనీల్, నవీన్ ఎర్రమనేని తదితరులు పాల్గొన్నారు.













