మెదడురోగ చికిత్సలకు డాక్టర్ సాంబరెడ్డి అత్యాధునిక పరిశోధనలు
వివిధ అవయవాలకు మన మెదడు నుంచి వెలువడే ఆదేశాలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలో నరాల ద్వారా ఆయా అవయవాలకు చేరతాయి. సాధారణంగా స్పందనలు క్రమబద్దంగా వెలువడుతూవుంటాయి. ఇది ఆరోగ్యమైన స్థితి. కానీ ఏకకాలంలో అనేక విద్యుత్ స్పందనలు లెక్కకు మీరి వెలువడితే కండరాలు బిగుసుకుపోవడం, స్పృహకోల్పోవడం, విచిత్రంగా ప్రవర్తించడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. మెదడునుం డి అసాధారణ విద్యుత్ స్పందనల వల్ల ఉన్నట్టుండి అకస్మాత్తుగా మనిషికి స్ప్రుహ తప్పుతుంది. అలా స్ప్రుహ కోల్పోవడాన్ని‘ సీజర్’ మూర్చ అంటాం. ‘ఫిట్స్’ అనడం కూడా వాడుకలోవుంది. ఇటువంటి అనారోగ్యాన్ని “ఎపిలెప్సీ” అంటారు. ఇది స్త్రీలలోనూ పురుషులలోనూ కూడా వుండవచ్చు. నెలసరి సమయంలో హటాత్తుగా పలుమార్లు మూర్చిళ్లే లక్షణం కొంతమంది స్ర్తీ మూర్చ రోగుల్లో వుంటుంది. ఋతిమతులైవున్న ఆ రోజులలో వారత్యధికంగా సీజర్స్ కి లోనవుతారు. ఇది దీర్ఘకాలిక మూర్చ రోగంలో ఒక భాగం. స్త్రీ బహిష్టు తో సంబంధం వున్న ఈ రకపు మూర్చని “కటమినియల్ ఎపిలెప్సి” అంటారు. కొన్ని వేల సంవత్స రాలనుండి వైద్యరంగానికి ఇది తెలిసి వున్నప్పటికీ తగిన చికిత్సా విధానం ఈ రోజుదాకా అందు బాటులో లేదు. ‘ఇంతే మాగతి’ అని భావిస్తు ప్రపంచ వ్యాప్తంగా నిరాశానిస్ప్రుహలకు లోనవుతున్న స్ర్తీలనేకులున్నారు.
డాక్టర్. డి. సాంబరెడ్డిగారు టెక్సస్ లోని ఎ&ఎమ్ వైద్య విశ్వవిద్యాలయ కళాశాలలో నాడీశాస్త్ర, ప్రయోగిక చికిత్సశాస్త్ర ఆఛార్యులు. గత రెండు దశాబ్దాలనుండి “కటమినియల్ ఎపిలెప్సి” కి గల కారణాల వెతుకులాటలో చాలా శ్రద్దగా పరిశోధన, అధ్యయనాలలో నిమగ్నమై వున్నారు.
“మీరే మాకు దారి చూపాలి. దయవుంచి మా ఈ పరిస్థితిని చక్కదిద్దరూ ?” అంటూ అభ్యర్ధనలతో రెడ్డిగారికి తరచుగా అంతర్జాలలో ఉత్తరాలు పంపడం, “మా దేశాన్ని దాటి విమానంలో మీ దగ్గరకు రమ్మనమన్నా రాగలను” అంటూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు దిగులుగా రెడ్డిగారిని అడగడం చాలా సర్వ సామాన్యమైపోయింది. అందుకు కారణం కొన్ని వేల సంవత్సరాలనుండి ఒక మిష్టరీ గా వున్న కెటామినియల్ ఎపిలెప్సీకి నిర్దిష్ట కారణమేమిటన్నది రెడ్డిగారు గట్టి పట్టుదలతో శ్రమిస్తూ, స్త్రీలకే ప్రత్యేకమైన ఈ సమస్యాపరిస్కారానికి నడుం కట్టుకొన్నవారవడమే.
తన పర్య వేక్షణలో డాక్టొరల్ డిగ్ర్రీ కోసం పరిశోధన చేస్తున్న విద్యార్ధి బ్రయన్ క్లోసెన్ (Bryan Clossen), తనూ కలసి Journal of Neuroscience Research 2017 అక్టోబర్ నెల సంచిక లో సాంబరెడ్డి గారు కేవలం మహీళలకే సంబధించిన హార్మోనల్ సిజర్స్ పై తమ పరిశోధనా వివరాలను ప్రచురించారు. ఆధునిక జన్యు మార్పిడి విధానాలను వాడుతూ అతి ప్రాచీనరోగమైన “కటమినియల్ ఎపిలెప్సి” పై ప్రకటించిన పరిశోధనలలో ఇదే ప్రప్రధమమైనది.
“మామూలుగా మూర్చరోగానికి వాడే యాంటిఎపిలిప్టిక్ మందులు ఈ మహిళలకు పనిచేయవు. చాలా కాలంనుండి డాక్టర్లు మూర్చ రోగానికి పురుష లకు వాడే మందులనే ఋతుస్రావ సంబంధిత మూర్చరోగానికి స్త్రీలకు వాడుతున్నారు. ఋతుస్రావ రోజులలో నున్న స్త్రీ హార్మోన్ లలో కలిగే మార్పులవల్ల మాములుగా మూర్చ రోగానికి వాడే డైయజిపామ్ (diazepam), వాల్ప్రొయేట్ (valproate) వంటి మందులకు వారి మెదడు సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల ఆమందుల ప్రభావం వారిపై వుండదు.” – అని సాంబరెడ్డిగారు అన్నారు.
మహిళల ఋతు చక్రంలో ఒకదాని తరువాత ఒకటిగా వరుసక్రమంలో జరిగే నాలుగు దశలు వుంటాయి.
మొదటిది ఫాలిక్యులార్ లేదా కూపిక దశ: ఇది అండాశయ పుటం ద్రవంతో నిండిన ఒక సంచి లో పరిపక్వంకాని అండాలు (స్త్రీ బీజాలు) తయారయ్యే దశ. రెండవది ఒవ్యులేటరి దశ, అనగా పరిపక్వమైన అండం అండకోశం ఉపరితలం నుంచి వుబికి వచ్చి, పగిలి, అండం విడుదలయ్యే దశ. మూడవది అండం విడుదలైన తరువాతి దశ. ఈ దశలో కూపిక (ఫాలికల్) మూసుకొని పోయి కార్పస్ ల్యుటియం అనే ఆకారంగా మారుతుంది. ఒక వేళ ఫలదీకరణ జరిగితే అందుకు అనుగుణంగా ఇది గర్భాశయాన్ని సిధ్ధం చేస్తుంది. ఈ కార్పస్ ల్యుటియం ఎక్కువ మోతాదులో ప్రోజెస్టరోన్ అనే హార్మోన్ ను ఉత్పన్నం చేసి రాబోయే పిండం కోసం గర్భాశయపు లోపలి పొరను (ఎండోమెట్రియం) ద్రవాలతోనూ, పోషకాలతోనూ నింపి దళసరిగా తయారు చేస్తుంది. అండం ఫలదీకరణ చెందక పోతే 14 రోజుల తరువాత కార్పస్ ల్యుటియం శిధిలమై పోయి నాలగవ దశ అయిన ఋతుస్రావం జరుగుతుంది. ఆతరువాత మళ్ళీ కొత్త ఋతు చక్రం మొదలౌతుంది.
ఈ దశలు నెత్తురులోని ఈస్టరోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ల నిష్పత్తిని ప్రభావితం చేయడం వల్ల మెదడు ఉత్తేజితం చెందే స్థాయి ప్రభావితంతమవుతుంది. మూర్చరోగులైన చాలామంది మహిళలలో వారి ఋతుస్రావ సమయంలో స్ప్రు హ కోల్పోవటానికి దారి తీస్తుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రోజెస్టెరాన్ హార్మోన్ మెదడు కణాలను జోకొడుతుంది. దీన్ని బట్టి శరీరంలో ఈస్ట్రోజెన్ పాళ్లు, ప్రోజెస్టెరాన్ పాళ్లు పెరగడం,తగ్గడం అనే అంశం మీద నరాల వ్యవస్థ ఉత్తేజితం కావడం ఆధారపడి ఉంటుందన్నమాట. హార్మోన్లలోని మార్పులు యువతుల్లో సీజర్స్ను ప్రేరేపిస్తాయి. అమెరికాలో 300,000 నుండి 500,000 మంది కటమినియల్ ఎపిలెప్సి రోగులున్నట్టు అంచనాలు చెపుతున్నాయి.
“ఎపిలెప్సి వున్న మెదడు విపరితంగా ఉత్తేజితమైనప్పుడు దాని విద్యుత్ వలయాలు ఎక్కువగా గాడీ తప్పడం వల్ల వ్యక్తి స్ప్రు హ కోల్పోతుంది. కానీ, ఒకవేళ ఆమె మెదడులో ఎక్కువస్థాయి దీర్ఘకాలిక నిరోధాన్ని ఉంచ గలిగితే, విద్యుత్ వలయాలు మితిమీరి ఉత్తేజితమవవు, అప్పుడు ఆవ్యక్తికి స్ప్రు హ తప్పడం జరగదు” – అని సాంబరెడ్డిగారు చెప్పారు.
నాడీఉత్ప్రే రకాలు (Neurosteroids) దీర్ఘకాలిక నిరోధానికి మధ్యవర్తిత్వం వహించే నాడీ ప్రవాహకాల (neurotransmitters) కి మెదడు గ్రాహకాలు ఎక్కువగానో లేదా తక్కువగానో స్పందించేలాచేస్తూ నాడీ సంబంధిత ఉత్తేజిత లక్షణం ఊత తప్పకుండా ఉంచడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి.
“ప్రోజెస్టెరాన్ హార్మోన్ ను శరీరం విడుదల చేసినపుడు అది మెదడుకి చేరి నాడీఉత్ప్రే రకంగా మార్పుచెందుతుంది. దీని పేరు అల్లో ప్రగ్ననొలోన్ (allopregnanolone). ప్రత్యేకించి మెదడులోని ఒకానొక రకపు గ్రాహంకంతో అల్లో ప్రగ్ననొలోన్ గట్టిగా తగులుకొని వుంటుంది. ఇలా ఆ గ్రాహకాన్ని బంధించిన అల్లో ప్రగ్ననొలోన్ గామా– అమైనో బ్యూటిరిక్ ఆమ్లమనే నాడీ ప్రవాహకానికి ఆ గ్రాహకాలు ఎక్కువ స్పందించేలా చేస్తుంది, గామా – అమైనో బ్యూటిరిక్ ఆమ్లాన్నేGABA అని కూడా అంటారని రెడ్డిగారు వివరించారు.
మెదడులో నిరోధాన్ని కలుగజేసే నాడీ ప్రవాహకంగా GABA పనిచేస్తుంది. అందువల్ల దీర్ఘకాలిక మూర్చరోగంతో వున్నవారికి GABA చాలా కీలకమైనది. ఎప్పుడైతే మెదడులోని చాలా ఎక్కువ GABA గ్రాహకాలను GABA బంధిస్తుందో అప్పుడు మెదడులో విద్యుత్ వలయం నిరోధించబడిన స్థితిలో కొనసాగగలదు, ఫలితంగా వ్యక్తి తెలివితప్పిపోవడం అనేది జరగదు. దీనిని బట్టి “కటమినియల్ ఎపిలెప్సి“ వున్న మహిళలలో తెలివి తప్పిపోయేస్థాయిని తగ్గించడంలో వారి నెత్తురు లోని ప్రొజెస్టిరోన్ హార్మోన్ కీలక మైనదని తెలుస్తున్నాది.
ఋతు స్రావ సమయంలో ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయి తగ్గి వుంటుంది. కనుక అల్లో ప్రగ్న నొలోన్ స్థాయి తగ్గుతుంది. అందువల్ల నాడీ వ్యవస్థలో ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి విద్యుత్ లేదా రసాయనసంకేతాలను చేరవేసే ‘సినాప్సె‘ నిర్మాణంలోని సినాప్టిక్ గ్రాహకాల సున్నితత్వం GABA పట్ల తగ్గిపోతుంది. దీని ఫలితంగా మెదడు ఎక్కువగా ఉత్తేజితమై, కటమినియల్ ఎపిలెప్సి స్త్రీలు పలుమార్లు స్ప్రుహ కోల్పో తారు.
“ఋతుచక్రంలోని ఋతుస్రావ దశ విషయానికి వస్తే అప్పుడు నాడీ ఉత్ప్రేరకం చాలా తక్కువగా తయారవడంవల్ల మెదడులో దీర్ఘకాలిక నిరోధం మాయమై నిరోధించుకోగలిగే స్థాయ తగ్గి విద్యుత్వలయం విపరీతంగా ఉత్తేజిత మవుతుంది.” అంటారు ఆచార్య సాంబరెడ్డి.
మెదడులో స్ప్రుహ కోల్పోయేలా చేసే వలయాలను క్రమబద్దీకరించే హిప్పోకాంపస్ ప్రదేశంలో నాడీ ఉత్ప్రేరకాల తగ్గుదల వల్ల కలిగే ప్రభావాలను ఈ అధ్యయనంలో పరిశోధకులు పరీక్షించారు. దీర్ఘ కాలిక, లేదా నిరంతర నిరోధానికి మధ్యవర్తిత్వలైన సినాప్టిక్ ఎక్స్ ట్రా డెల్టా GABA-A గ్రాహకాలను (extra synaptic delta GABA-A receptors) తీసివేసి, హిప్పోకాంపస్ ప్రదేశం స్ప్రు హ తప్పిపోవడానికి ఏమాత్రం లొంగుబాటును ప్రదర్శించగలదో తెలుసుకొన్నారు. ఆతరువాత ఋతుచక్రలో అల్లో ప్రగ్న నొలోన్ వంటి నాడీఉత్ప్రే రకాల హెచ్చు, తగ్గుల ప్రావాహక స్థాయిలను కలిగించి చూసారు. నాడీ ఉత్ప్రేరకాలు తక్కువ స్థాయిలో వున్నప్పుడు, తెలివితప్పిపోవడంలో తీవ్రత, తెలివితప్పిపోయి వుండె కాలం రెండూ కూడా ఎక్కువైనట్టుగా వారి ఫలితాలు వెల్లడించాయి.
“దీర్ఘకాలిక నిరోధపు నాడీకణాల కోడ్ ను మేము చేదించగలిగాము. విద్యుద్వలయాన్ని పెడదారినుండి తప్పించే బలానికి మధ్యవర్తిత్వం జరిపే హిప్పో కాపస్ లోని ఎక్సట్రా సినాప్టిక్ డెల్టా GABA-A గ్రాహకాలే ఋతుస్రావ సమయపు స్ప్రుహ కోల్పోవడాన్ని నియంత్రిస్తాయి. దీనితో దీర్ఘకాలిక నిరోధాన్ని పెంచే నాడీఉత్ప్రేరక కారకాలతో కెటామినియల్ ఎపిలెప్సీకి వైద్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా భవిస్తూ చేసే చికిత్స ప్రయత్నాలకు తెర తీయడమైంది.” అన్నారు నాడీ శాస్త్ర అచార్యులు, పరిశోధకులు అయిన డాక్టర్ సాంబ రెడ్డిగారు.
ఈ పరిశోధనా పత్రంలోని ఫలితాలు పరిశోధన స్థాయినుండి చికిత్సా ప్రయత్నాలని రోగి మంచందాకా తీసికెళ్ళగలవని సూచిస్తునాయి. నాడీఉత్ప్రేరక కారకాలతో తక్కువ మోతాదులో ఇచ్చే పల్స్ థెరపి కెటామినియల్ సీజర్స్ ని దుష్ప్రభావాలకు తావీయకుండా అదుపులో పెట్టగలదు.
“నా భార్య అస్వస్థత కి గూగుల్ ని వెదుకుతూ అకస్మాత్తుగా మీ వెబ్ సైట్ ని చూసాను. మీరు అద్భుతమైన పరిశోధన చేస్తున్నారు. చికిత్సా ప్రయత్నాలు ఫలప్రదమై తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. నా భార్య, వేల కొద్ది మహిళలు దీనివల్ల లాభాన్ని పొందుతారని నమ్ముతున్నాను.” రెడ్డిగారికి ఓ ఆసామీ అంతర్జాల ఉత్తరం పంపాడు.
కెటామినియల్ఎపిలెప్సికి తగిన చికిత్సను అందుబాటులోకి తేవడం ఎంకెంతో దూరంలో లేదు. ఇరవై సంవత్సరాల అలుపెరుగని ఆచార్య దూదిపాల సాంబరెడ్డిగారి ఈ పరిశోధనకి National Institutes of Health వారు పదమూడేళ్ల పాటు నిరంతరంగా ఆర్ధిక సహాయాన్ని అందించారు.













