టీఎస్ ఆర్టీసీ సమ్మెకు ప్రవాస భారతీయుల మద్దతు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అమెరికాలోని ప్రవాస భారతీయలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశాలు ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్లో జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తుండగా అనూహ్య ఘటన ఎదురైంది. సభకు హాజరైన వారిలో కొందరు ఎన్ఆర్ఐలు లేచి నిలబడి తెలంగాణ ఆర్టీసీని రక్షించండి.. రక్షించండి అంటూ నినాదాలు చేయడంతో ఆశ్చర్యపోవడం వినోద్ వంతయింది. ఈ అంశం కారణగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. అయితే నిర్వాహకులు సర్ధిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.













