USA: అమెరికా లో స్టూడెంట్స్ కి నోటీసులు.. ఆందోళనలో భారతీయ విద్యార్దులు.. తెలుగు విద్యార్ధుల కోసం తానా సహాయక చర్యలు
జనవరి నెలాఖరు లో అమెరికా అధ్యక్షులు గా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి. 2-3 వారాల్లో అమెరికా లో స్టూడెంట్ వీసా మీద చదువుకున్న వారు పూర్తిగా స్టూడెంట్ వీసా రూల్స్ ప్రకారం ఉండాలని, కేవలం వారానికి 20 గంటలు, అందునా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉద్యోగం చేయవచ్చునని, అంతకు భిన్నంగా ఎవరు ఉన్నా వారు అమెరికా దేశం లో అక్రమంగా ఉన్నట్టే అని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పటం స్టూడెంట్స్ అందరూ భయాందోళనలు చెందటం అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఆ పాయింట్ ను సరిగ్గా అర్థం చేసుకొని స్టూడెంట్స్ అందరూ తమ తమ ఉద్యోగాలను సరిచేసుకోవటం జరిగి, ఆ ఆందోళన సద్దుమణిగింది అనే చెప్పాలి. లీగల్ గా పద్దతి గా ఉంటే ఎలాంటి సమస్య లేదు అని అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
అయితే గత 10 రోజులుగా దాదాపు అన్ని యూనివర్సిటీ లలో చదువుకుంటున్న విద్యార్ధులకు ఇమ్మిగ్రేషన్ ఆఫీసు నుంచి ( SEVIS – Students and Exchange Visitor Information System ) నుంచి నోటీసులు ఇమెయిల్ ద్వారా రావడం మొదలయ్యాయి. ఈ విధంగా నోటీసులు వచ్చిన వారి సంఖ్య లో వేల లో ఉందని తెలుస్తోంది.
సాధారణ పరిస్థితులలో అమెరికా లో చట్టం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకొందాం. అమెరికా లో స్పీడ్ లిమిట్ దాటి వెళితే పోలీస్ లు పట్టుకొని స్పీడింగ్ నేరంగా టికెట్ ఇస్తారు. సాధారణంగా చిన్న వార్నింగ్, కొద్దిపాటి ఫైన్ తో ఈ కేసు లు ముగుస్తాయి. ఎక్కువ సార్లు స్పీడింగ్ కేసులు, DUI ( Driving Under Influence ) అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటే ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కాన్సిల్ చేస్తారు.
అలాగే షాప్ లలో చేసే చిన్న చిన్న చిల్లర దొంగతనాలకు కూడా పోలీస్ లు చిన్న వార్నింగ్, కొంచెం గా ఫైన్ వేయటం జరుగుతూ వుంటాయి. అలాగే పూల్ పార్టీ అని విద్యార్దులు, యువకులు పార్టీ పేరుతో ఇంటి పక్కనున్న వారి ప్రశాంతత ను బంగపరుస్తే, పోలీసులు ఆ యువకుల మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇవి అన్ని పూర్తిగా క్రిమినల్ కేసులు కావు. అయితే పోలీస్ రికార్డు లోకి వెళ్లిన కేసులు.
ఇప్పుడు అమెరికా లో విద్యార్ధులకు గతం లో వారిపై ఉన్న చిల్లర కేసులు బయటకు తీసి వారి F1 ( స్టూడెంట్ వీసా) వీసా ను వెనక్కు తీసుకొని, దేశం నుంచి బయటకు పంపటానికి నోటీసులు పంపుతున్నారు. ఎప్పుడో కార్ డ్రైవ్ చేస్తూ చేసిన స్పీడింగ్ నేరానికి ఇప్పుడు ఈ శిక్ష ఏమిటీ అని విద్యార్దులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
స్టూడెంట్స్ అడ్మిషన్స్ లో ఎంతో అనుభవం ఉన్న శ్రీ రవి లోతుమళ్ళ మాట్లాడుతూ దాదాపు 65 పైగా యూనివర్శిటీ లలో చదువుకుంటున్న వేల సంఖ్య లో విద్యార్ధులకు నోటీస్ లు అందాయని, ఒక్కో కేసు ఒకొక్క రకమని చెప్పారు. న్యూ జెర్సీ, వర్జీనియా లలో అనేక మంది విద్యార్ధులు తమకు వచ్చిన నోటీస్ లతో దిక్కు తోచని పరిస్తితులలో తానా సంస్థను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
తానా లో NRI Students Coordinator గా వున్న Dr శ్రీకాంత్ కోనంకి మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రతిరోజూ అనేక ఇమెయిల్స్, ఫోన్స్ వస్తున్నాయని వెంటనే తానా నాయకత్వానికి చెప్పామని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగిందని ఈ విషయం పై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు.
డా నరేన్ కోడాలి, తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మాట్లాడుతూ మొదట తానా లీగల్ సెల్ నుంచి చెయ్యాల్సిన కార్యాచరణ తెలుసుకొన్నామని, అన్ని రాష్ట్రాలలో వున్న తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ లకు తగిన సూచనలు ఇచ్చామని తెలిపారు.
బోస్టన్ నగరం నుంచి తానా నాయకులు శ్రీ కే పి సోంపల్లి మాట్లాడుతూ సాధారణంగా కారు డ్రైవింగ్ విషయం లో ఉండే కేసు ల గురించి ఒక ఫ్లయర్ , తరువాత వేరు వేరు పట్టణాలలో ఉండే ఇమ్మిగ్రేషన్ లాయర్ ల వివరాలు అన్ని చోట్ల విద్యార్ధులకు అందుబాటులో ఉంచామని , విద్యార్ధులు వారి వీలును బట్టి ఇమ్మిగ్రేషన్ లాయర్ ను సంప్రదించి ముందుకు వెళ్లాలని సూచించారు.








