ఉత్తర కొరియా సంచలన నిర్ణయం
ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ అకస్మాత్తు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల మిస్సైల్‌తో పాటు అణు పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి న్యూక్లియర్ పరీక్షలు, ఖండాంతర క్షిపణుల ప్రయోగాలను ఆపేస్తున్నట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. కొరియా ద్వీపకల్పంలో ఆర్థిక ప్రగతి, శాంతిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వచ్చే వారం జరగనున్న సమావేశంలో కింగ్ జాంగ్ తమ పొరుగుదేశం సౌత్ కొరియా నేత మూన్తో భేటీకానున్నారు. జూన్‌లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రత్యేక శిఖరాగ సమావేశాన్ని కిమ్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కొరియా తీసుకున్న అణు, మిస్సైల్ పరీక్షల నిలిపివేత నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు స్వాగతించారు. నార్త్ కొరియాతో పాటు ప్రపంచానికి ఇది శుభసందేశమన్నారు.













