మళ్లీ క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తరకొరియా! అమెరికా యుద్ధనౌకలే లక్ష్యమా?
ఉత్తరకొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అయితే ఈసారి స్వల్ప శ్రేణి నౌక విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. ఉత్తరకొరియాలోని తూర్పు తీరంలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి.
గురువారం ఉదయం ఉత్తరకొరియా తూర్పతీరం నుంచి కొన్ని గుర్తుతెలియని ఆయుధాలను పరీక్షించారని, బహుశా ఇవి భూమిపై నుంచి నౌకలపైకి దాడి చేసేందుకు ఉపయోగించే క్షిపణులు కావచ్చని దక్షిణకొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.
ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకు అమెరికా ఇప్పటికే థాడ్ మిస్సైల్ వ్యవస్థను దక్షిణ కొరియాకు చేర్చింది. అంతేకాకుండా, కార్ల్ విన్సన్, రొనాల్డ్ రీగన్ యుద్ధనౌకలను కూడా ఉత్తరకొరియా సమీప సముద్ర జలాల్లోకి పంపి లంగరేయించింది.
కానీ అమెరికా చర్యకు ఉత్తరకొరియా ఏమాత్రం బెదరలేదు. ఇప్పుడు తాజాగా ఆ దేశం నిర్వహించిన క్షిపణి పరీక్షలు చూస్తుంటే.. అమెరికా యుద్ధనౌకలే దాని తదుపరి టార్గెట్ గా తెలుస్తోంది.
గురువారం ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణులు ఆ దేశానికి సుమారు 120 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాయి. ఉత్తరకొరియా ఇటువంటివి మొత్తం 4 క్షిపణులను పరీక్షించింది. ఐక్యరాజ్యసమితి తనపై ఆంక్షలను తీవ్రం చేసిన వారానికే ఉత్తరకొరియా ఈ పరీక్షలు నిర్వహించడం సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా మరిన్ని రెచ్చగొట్టే చర్యలు చేపట్టే అవకాశం ఉండటంతో నిఘా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు దక్షిణకొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తామే పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.













