ప్రధాని మోదీతో నిక్కీ హేలీ భేటీ
ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధిగా ఉన్న ప్రముఖ భారతీయ అమెరికన్ నిక్కీ హెేలీ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటంతో పాటు పలు రంగాల్లో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారు చర్చలు జరిపారు. దక్షిణాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలను ఈ సమావేశంలో మోదీ ప్రశంసించారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రరహితంగా మార్చేందుకు ఆయన తీసుకుంటున్న చొరవను కూడా కొనియాడారు. ట్రంప్ తరపున మోదీకి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేసిన హేలీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తోనూ సమావేశమయ్యారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థితో కూడా హేలీ భేటీ అయ్యారు.













