పత్రికలతో కరోనా వ్యాపించదు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూస్ పేపర్ ద్వారా కరోనా రాదని, వచ్చే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వార్తాపత్రికలను తాకొచ్చని, అవి సురక్షితమేనని తేల్చిచెప్పింది. మన ఇంటికి వచ్చే పేపర్లు కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినా అవి సురక్షితమేనని, ముద్రణ నుంచి ఇళ్లకు చేరే దాకా అనేక దశల్లో, పలు వాతావరణాల్లో ప్రయాణించే వార్తాపత్రికల ద్వారా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని తెలిపింది. అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా న్యూస్పేపర్ల ద్వారా వైరస్ వ్యాపించే ముప్పు చాలా తక్కువని స్పష్టం చేసింది. ఇక, వైరస్ ఉధ•తి ఇంత ఎక్కువగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ వార్తాపత్రికలు మూతపడలేదని సాంక్రమిక వ్యాధులపై మహారాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు డాక్టర్ సుభాష్ సాలుంకే అన్నారు. వార్తాపత్రికల ముద్రణ నుంచి ప్యాకింగ్ దాకా ఆటోమేటెడ్ పద్ధతులే అమలవుతున్నాయని, వాటిని పట్టుకుని చదవడం పూర్తిగా సురక్షితమన్నారు. కరోనా వైరస్ మనుగడ సాగించాలంటే దానికి జీవకణాలు కావాలని.. నిర్మాణరీత్యా సూక్ష్మమైన రంధ్రాలు ఉండే, జీవం లేని పేపర్లపై ఆ వైరస్ ఎక్కువ సేపు మనుగడ సాగించలేదని.. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది.













