అమెరికా అధ్యక్షుడితో న్యూజిలాండ్ ప్రధాని భేటీ ఖరారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ భేటీ అవుతారని న్యూజిలాండ్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే వారంలో ఈ సమావేశం జరుగనుందని తెలిపింది. కాగా ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. 2017లో ట్రాన్స్ పసిఫిక్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చ జరిగే అవకాశముందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. జాతి ప్రయోజనాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడితో తాను భేటీకి సిద్ధమైనట్టు ఆర్డెన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.













