న్యూయార్క్ పోలీస్ శాఖలో తొలి సిక్కు మహిళ
పోలీస్ శాఖలో మెదటి సారిగా తలపాగ కల్గిన సిక్కు మహిళ పోలీసు అధికారిగా చేరబోతుంది. సిక్కుమతంపై అవగాహన కల్పించడానికి, పోలీస్ శాఖలో చేరేలా ఇతరులకు ప్రేరణ కల్పించడానికి గురుసోఖ్ కౌర్ అనే మహిళను పోలీసుశాఖలోకి తీసుకోనున్నారు. న్యూయార్క్ పోలీస్ అకాడమీలో గతవారం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కౌర్ సహాయక పోలీసు అధికారిణి(ఏపీఓ)గా త్వరలోనే పోలీస్ శాఖలో చేరబోతున్నారు. డిపార్ట్మెంట్లోకి మొదటి సిక్కు మహిళా పోలీసు అధికారిగా కౌర్‌ను ఆహ్వానించడానికి గర్వపడుతున్నామని సిక్కు ఆఫీసర్స్ అసోసియేషన్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ అభినందనలు తెలిపింది. లా ఎస్‌ఫోర్స్‌మెంట్ ఫ్యామిలీలో చేరేలా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరింది. లా ఎస్ఫోర్స్మెంట్లో సిక్కు అధికారులకు ప్రాతినిథ్యం వహించే మొదటి సంస్థ ఈ అసోసియేషన్ కావడం గమనార్హం.
న్యూయార్క్ పోలీస్ శాఖలో తలపాగా కల్గిన ఒక మహిళా అధికారిని చూడటం సంతోషంగా ఉందని, అమెరికాలో సిక్కుమతం గురించి మరింత అవగాహన కల్పించడానికి కౌర్ తన తోడ్పాటు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్దీప్సింగ్ పూరీ ట్వీట్ చేశారు. గతంలో తనకూ, ఇతర సిక్కు మతస్థులకు ఎదురైన ఇబ్బందులు ప్రస్తావిస్తూ అటువంటి వాటిపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలని అన్నారు.













