హెచ్-1బీ జారీలో అక్కడ చదువుకున్న వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలి
విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించే హెచ్-1బీ, ఎల్-1 వీసాల జారీ విధానంలో కీలక సంస్కరణల వైపు అమెరికా అడుగులేస్తోంది. దేశ పౌరుల ఉపాధికి భంగం కలగకుండా, యూఎస్‌లో చదువుకున్న విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యమిస్తూ ఒక బిల్లును రూపొందించి తాజాగా చట్టసభల్లో ప్రవేశ పెట్టారు. ‘ది హెచ్-1బీ అండ్ ఎల్-1 వీసా రిఫార్మ్ యాక్ట్’ పేరిట ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీలు ఈ బిల్లును రూపొందించాయి. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులను నియమించడాన్ని పూర్తిగా నిషేధించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ప్రధానంగా తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం భారీగా హెచ్-1బీ, ఎల్-1 ఉద్యోగులను విదేశాల నుంచి రప్పించి తిరిగి వారిని స్వదేశాలకు పంపిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే యూఎస్‌లో చదువుకొని మంచి నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులకు హెచ్-1బీ జారీలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది.













