సిలికానాంధ్ర వర్సిటీకి త్వరలో కొత్త క్యాంపస్.. ఆనంద్ కూచిభట్ల
అమెరికాలో భారతీయ అమెరికన్లు నడుపుతున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకూ భారతీయ నృత్యాలు, భాషలకు సంబంధించి కోర్సులు నిర్వహిస్తుండగా, ఇప్పుడు కృత్రిమ మేధ లాంటి అధునాతన కోర్సులను కూడా బోధించనున్నారు. దీంతో పాటు వైద్య కశాశాల, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం తదితర సౌకర్యాలతో వర్సిటీ క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు నిర్వాహకులు ఆనంద్ కూచిభట్ల తెలిపారు. ఓ దాత విరాళంగా ఇచ్చిన 67 ఎకరాల స్థలంలో దీన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని మిల్పిటస్లో ప్రధాన క్యాంపస్ ఉంది. 2017లో 44 మంది విద్యార్థులతో మొదలు పెట్టిన యూనివర్సిటీలో ఇప్పుడు 230 మంది విద్యార్థులు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎండీ ఇన్ అలోపతి మెడిసిన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 12 భారత వర్సిటీలతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.













