హ్యూస్టన్ లో ఘనంగా తెలుగు వెన్నెల సమావేశం
హ్యూస్టన్ లో జనవరి 26వ తేదీన 89వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం జరిగింది. హ్యూస్టన్ తెలుగు సాంస్క తిక సమితి కి కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్న మధు పెమ్మరాజు సభను ప్రారంభించారు. తొలుత సుధేష్ పిల్లుట్ల భారత దేశ చరిత్ర ఆంగ్లేయులు, వారి అడుగుజాడలలో నడిచే భారత చరిత్ర కారులు ఎన్నో ఏళ్ళగా మన చరిత్రని తప్పుడు తడకలు గా వ్రాశారు అనీ, దాన్ని ఇప్పుడు సరిచేసి మన చరిత్రని మనమే వాస్తవాలని ప్రతిబింబిస్తూ వ్రాసుకోవాలనీ సోదాహరణంగా వివరించారు. ఉదాహరణకి కోట వెంకటాచలం గారి సిద్దాంతాల ప్రకారం బ్రిటిష్ వారు చంద్రగుప్తుడినీ, అతని కాలాన్ని సరిగా గుర్తించ లేక మన చరిత్రని 1500 సంవత్సరాలు ముందుకి నెట్టేశారు అనీ, అలాగే నెహ్రూ గారితో సహా అశోకుడు చాలా గొప్ప చక్రవర్తి అని కీర్తించారు కానీ నిజానికి అశోకుడు మాములు రాజే అని సుదేష్ అభిప్రాయ పడ్డారు.
ఆ తరువాత ఆ నాటి ముఖ్య అతిధి, ప్రముఖ కవి సబ్బని లక్ష్మీ నారాయణ గారి ”ఆట వెలదిలో అమెరికా” అనే శతక కావ్యం ఆవిష్కరణ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అన్నింటి కన్నా ముందు మా సత్యదేవ్ ఆ పుస్తకానికి డా. గండ్ర లక్ష్మణ రావు గారు వ్రాసిన ముందు మాట చదివి గ్రంధ కర్తనీ, ఆ పద్య కావ్యాన్నీ పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ సభ అంత బాగా జరగానికి ఒక కారణం తెలిసో తెలియకో ఆ కరీంనగర్ కవి గారు ఈ కాకినాడ కుర్రాడికి ..అంటే నాకే …ఆ పుస్తకం అంకితం ఇచ్చారు. నా మీద ఐదు ఆట వెలది పద్యాలు కూడా వ్రాసి అంకితం పేజీలో నా ఫోటోతో పాటు ప్రచురించారు. అంతే కాదు, ఆయన వ్రాసిన ఆ ‘పంచ రత్నాలు” కవితలని సుంకు వెంకటాద్రి అనే ఆయన శ్రావ్యంగా పాడిన ఆడియోనూ వినిపించారు. సబ్బని గారి ప్రసంగం అవగానే అందరూ లేచి వెళ్లిపోతుంటే శాలువా కప్పించుకున్న వీరుడిగా నేను స్పందించాలి కాబట్టి నేను నోరు మెదపగానే కొంత మంది ఆహుతులు వెనుతిరగకుండా వెళ్లి పోయినా మరి కొందరు ఈసురో మంటూ చతికిల పడ్డారు. అప్పుడు నేను, సబ్బని గారు ఆ పుస్తకం నాకు అంకితం ఇచ్చి తెలుగు పాఠక లోకానికి ఎంత మేలు చేశారో చెప్పగానే అందరూ హాయిగా నవ్వేశారు.
అసలేం జరిగిందంటే…..గత కొన్నేళ్ళగా నాకు ఒక డాక్టరేట్ థీసిస్, రెండు, మూడు కథల పుస్తకాలు, ఒక ఆత్మ కథ వగైరాలు అంకితం ఇచ్చారు అమాయకులైన ఆయా రచయితలు కానీ ఏ ఒక్క కవీ కూడా తన కవితా సంకలనాన్ని నాకు అంకితం ఇవ్వడానికి ధైర్యం చెయ్య లేదు. అంచేత పోనీ నేను కొన్ని కవితలు బరికేసి, ఒక పుస్తకం వేసేసుకుని నాకు నేనే ఆ లోటు భర్తీ చేసుకుందామా అనే దురాచోచన చేస్తున్నప్పుడు సబ్బని గారు పిలిచి ఆయన వాసిన ఈ ”ఆట వెలది లో అమెరికా” పద్య కావ్యం అంకితం ఇస్తానంటే ముందు భయం వేసి ఒద్దు బాబోయ్ ఒద్దు అన్నాను. కానీ ఆయన పట్టుదల మీద ఒప్పుకోగానే ”అమ్మయ్య, ఇక నేను కవితలు వ్రాసి తెలుగు సాహితీ లోకాన్ని నానా ఇబ్బందీ పెట్టక్కర లేదు కదా, బతికి పోయారు” అని అనుకున్నాను. మరి ఇలా ఉన్నమాట పబ్లిగ్గా ఒప్పేసుకున్నాను కాబట్టి మా వాళ్ళు హాయిగా నవ్వేశారన్నమాట.
– వంగూరి చిట్టెన్ రాజు













