సమస్య పరిష్కారం కాకుంటే మరో షట్ డౌన్ ?
సరిహద్దుల్లో గోడ నిర్మాణంపై అమెరికా కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరో షట్డౌన్ తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చి బిల్లు పాస్ చేయడానికి ఫిబ్రవరి 15 వరకు మాత్రమే సమయం ఉంది. కానీ చర్చల్లో పెద్దగా పురోగతి లేదు. పత్రాలు లేని వలసదారుల అరెస్టులపై, సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపులపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. దీంతో ఫెడరల్ వ్యయాలకు నిధులు కేటాయించే ఒప్పందం ఈ నెల 15తో ముగియనుంది. సెనెట్, ప్రతినిధుల సభల నుంచి ఇరు పార్టీలకు చెందిన 17 మంది సభ్యులు సరిహద్దు రక్షణ బిల్లుకు రూపునిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఆమోదం పొందేలా ఈ బిల్లును రూపొందించాల్సి ఉంది.
తాజా చర్చలు ముందుకు జరగక పోవడానికి డెమోక్రాట్ల డిమాండే కారణమని సమాచారం. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉన్న వలసదార్లలో ఎంతమందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అదుపులోకి తీసుకోవాలనే అంశంపై పీటముడి పడింది. వలసదార్లను నిర్బంధించే కేంద్రాల్లో పడకల సంఖ్యను 16,500కు పరిమితం చేయాలని డెమెక్రాట్లు కోరుతున్నారు. ఇదే జరిగితే ఐసీఈ అంతకంటే ఎక్కువ మందిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉండదు. దీంతో నేరచరిత్ర ఉన్నవారినే అదుపులోకి తీసుకొనేందుకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5.7 బిలియన్ డాలర్ల వరకు కోరారు. కానీ కాంగ్రెస్ మాత్రం 1.3 బిలియ్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. దీనిపై ట్రంప్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. డెమోక్రాట్ల బోర్డర్ కమిటీ వారి నేతలను ఒప్పందం చేసుకోనిచ్చేలా లేదు. చాలా కీలకమైన సరిహద్దు గోడకు వారు చాలా తక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారు అని పేర్కొన్నారు.
గతంలో 35 రోజుల పాటు ఏకాదాటిగా అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద షట్డౌన్. లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోసారి షట్డౌన్ జరిగితే హోంల్యాండ్ సెక్యూరిటీ, రాష్ట్రాలు, వ్యసాయ, వాణిజ్య శాఖలకు నిధులు అందవు. దాదాపు 8,00,000 మంది ఉద్యోగులు జీతాలు అందక అవస్థలు పడతారు.













