NATS: నాట్స్ అయోవా విభాగం తొలి క్రికెట్ లీగ్

అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా అయోవాలో క్రికెట్ లీగ్ నిర్వహించింది. సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి ఒక నెల పాటు జరిగిన ఈ జరిగిన ఉత్సవం సెప్టెంబర్ 28తో ముగిసింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ లీగ్ తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని చాటింది. నాట్స్ అయోవా విభాగం తొలిసారిగా నిర్వహించిన క్రికెట్ లీగ్ దిగ్విజయం చేయడంలో నాట్స్ అయోవా విభాగ నాయకులు ఎంతగానో కృషి చేశారు. అయోవా నాట్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ నవీన్ ఇంటూరి నేతృత్వంలో ఈ లీగ్ మ్యాచ్‌లు దిగ్విజయంగా జరిగాయి. ఈ నెల రోజుల లీగ్‌లో తెలుగు క్రికెట్ ప్లేయర్లు తమ అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ అభిమానుల మనస్సులు గెలుచుకున్నారు. ఈ లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ “రాయల్ ఛాలెంజర్స్”, “యునైటెడ్ ఎలెవన్” జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్ విజేతలకు నాట్స్ నాయకులు బహుమతులు ప్రదానం చేశారు.
విజేతల వివరాలు:
• ఉత్తమ బౌలర్: ఇందర్దీప్
• ఉత్తమ బ్యాట్స్‌మెన్: నరేంద్ర గంగరాజు
• మ్యాన్ ఆఫ్ ది సిరీస్: జితేంద్ర కాస్
• ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: జితేంద్ర కాస్ & హిమాన్షు టి.
ఈ క్రికెట్ లీగ్ విజయానికి స్థానిక వ్యాపార సంస్థలు, తెలుగువారి మద్దతు గణనీయంగా దోహదపడింది. నాట్స్ సభ్యుడు గిరీష్ కంచర్ల ఆహార సేవల సమన్వయం చేశారు. ఈ క్రికెట్ లీగ్‌కు అమూల్యమైన సహకారాన్ని అందించిన తరుణ్ మండవ, కృష్ణ మాంగమూరిలకు నాట్స్ అయోవా విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అలాగే, డా. స్మిత కుర్ర, కల్యాణి గోపాలం, సింధు మాన్వాడి, యుగంధర్ బాబు యెంప్రాల వంటి సభ్యులు ఈ లీగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ అయోవా విభాగం తొలిసారి నిర్వహించిన లీగ్‌ను దిగ్విజయం చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ జమ్ముల అభినందనలు తెలిపారు. ఈ లీగ్ ద్వారా అయోవాలో తెలుగు క్రీడాకారులకు నాట్స్ ఒక వేదిక కల్పించిందనేది నాట్స్ అయోవా టీం చాటిందని వారు ప్రశంసించారు.