తుపాన్ బాధితులకు నాట్స్ సాయం
తితలీ తుఫాన్ దెబ్బకు అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా బాధితులను ఆదుకోవాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సంకల్పించింది. గతంలోనూ హుదూద్ తుఫాన్ సంభవించిన సమయంలో విశాఖ కోసం నాట్స్ తన వంతు సాయం చేసింది. విశాఖ పచ్చదనం పునరుద్ధరణలో భాగంగా.. మొక్కలు నాటడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంలో నాట్స్ ఆర్థిక సాయం చేసింది. ప్రస్తుతం తితలీ బాధితులను కూడా ఆదుకోవాలని నాట్స్ శరవేగంగా స్పందిస్తోంది. దీనికోసం నాట్స్ చాప్టర్లతో సంప్రదించి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోంది. అమెరికాలో ఉండే తెలుగువారు… సాటి తెలుగువారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. మరో వైపు తితలీ ప్రభావిత ప్రాంతాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస మంచికలపూడి.. పలాస, సోంపేట ప్రాంతాలకు 50 మందికిపైగా నాట్స్ వాలంటీర్లను పంపించారు. తితలీ బాధితులకు నిత్యావసర వస్తువులు, చీరలు, దుప్పట్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక గ్లో ఫౌండేషన్.. నాట్స్‌కు తన సహాయ సహకారాలు అందిస్తోంది. తితలీ బాధితుల కోసం ఐదు వేల ఆహార పొట్లాలను సిద్ధం చేసి పంపిణీ చేస్తోంది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి.. అమెరికా నుంచే నాట్స్ సభ్యులు, వాలంటీర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కషి చేస్తున్నారు. రేపటి నుంచి శ్రీకాకుళంలోని మరో 7 గ్రామాలకు నాట్స్ సేవలందించనుందని ఆయన తెలిపారు.













