NATS: నాట్స్ 8వ తెలుగు సంబరాల వేదికపై తనికెళ్ల భరణికి ఘనసత్కారం
తెలుగు చిత్రపరిశ్రమలో రచయితగా, నటునిగా, దర్శకునిగా, కవిగా తనదైన ముద్ర వేసిన తనికెళ్ల భరణి (Tanikella Bharani) గారిని నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ఘనంగా సత్కరించారు. నాట్స్ సభ్యులు మురళీ మేడిచర్ల, శ్యామ్ తంగిరాల, మాధురి, శ్యామ్, భాస్కర్ సోమంచి తదితరులంతా కలిసి తనికెళ్ల భరణిని సత్కరించారు. తన కెరీర్లో 700పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాట్స్ తెలుగు సంబరాలకు విచ్చేసిన అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించిన నాట్స్‌కు అభినందనలు తెలిపారు. నాట్స్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు. ఈ సంబరాలకు విచ్చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, విక్టరీ వెంకటేశ్, నటి మీనా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తదితరులందరికీ నమస్కరించారు. చివరగా ‘ఆటగదరా శివా.. ఆటగదరా కేశవా..’ అంటూ తను రచించిన పాపులర్ పాటను ఆలపించి అందర్నీ అలరించారు.







