గుంటూరులో పేదలకు నాట్స్ సాయం 100 కుటుంబాలకు బియ్యం పంపిణీ
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కరోనా దెబ్బకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. గుంటూరు నగరంలో 100 కుటుంబాలకు నాట్స్ న్యూజెర్సీ విభాగం నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. నాట్స్ సెక్రటరీ రంజీత్ చాగంటి సహకారంతో న్యూజెర్సీ నాట్స్ విభాగం వరుసగా ఇలా పేదలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టింది. గుంటూరు లోని నెహ్రునగర్, డొంక రోడ్డు ప్రాంతాల్లో నాట్స్ ఇలా నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు భరోసా ఇచ్చింది. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రంజిత్ చాగంటి చూపిన చొరవను నాట్స్ జాతీయ నాయకత్వం ప్రశంసించింది. ఒక వైపు పనుల్లేక ఇబ్బందులు పడుతున్న తమకు నాట్స్ మేమున్నామంటూ సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని పేదలు హర్షం వ్యక్తం చేశారు.













