కర్నూలు పాతబస్తీలో 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఇటు కరోనా లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తోంది. కరోనా లాక్ డౌన్ తో పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల మరియు పేద కుటుంబాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేసింది. ఇక్కడ వలస కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక పెద్దలు కొందరు నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి నిరుపేదలకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు కావాల్సిన సాయాన్ని అందించారు. దీంతో స్థానిక పెద్దలు 500 కుటుంబాలకు ఆహార పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా స్థానిక నాయకులు గౌస్ దేశాయ్, రాధాకృష్ణ, రాజశేఖర్, శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు. కరోనా వల్ల పనులు లేక ఉపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితుల్లో ఉన్న వలస కార్మికులు, పేదలకు నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి అందించిన సాయం మరువలేనిదని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న ఇక్కడ తెలుగువారు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించి సాయం చేసిన బాపయ్య చౌదరిని స్థానిక నాయకులు ప్రశంసించారు. తెలుగు ప్రజలకు ఎక్కడ కష్టాల్లో ఉన్నా తాము తోచిన సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.













