నాట్స్ కోవిడ్ సేవల పుస్తకం మా బలాన్ని పెంచింది…శ్రీధర్ అప్పసాని
కోవిడ్ సమయంలో నాట్స్ చేపట్టిన సేవా కార్యక్రమాలపై తెలుగు టైమ్స్ రూపొందించిన 80 పేజీల పుస్తకం మా బలాన్ని పెంచిందని, ఇతరులకు స్ఫూర్తిని కలిగించేదిగా ఉందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని అన్నారు. సేవే గమ్యం అనేది నాట్స్ నినాదమని.. జీవితాంతం సేవకు అంకితమైన గాంధీ జయంతి రోజు నాట్స్ కరోనా సమయంలో చేపట్టిన సేవలపై పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అంటూ, నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా ఎప్పుడూ పదిమందికి చెప్పుకోదని, సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయదని, కాని తెలుగు టైమ్స్ నేడు మేము కరోనా సమయంలో చేసిన కార్యక్రమాలన్నింటిని పుస్తకరూపంలో తీసుకురావడం మా బలాన్ని తెలియజేసిందని అన్నారు. ఇలాంటి పుస్తకాన్ని తీసుకువచ్చిన తెలుగుటైమ్స్ను ఆయన అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా తెలుగుటైమ్స్తో కలిసి మా అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కోవిడ్ సమయంలో నాట్స్ చేపట్టిన సేవా కార్యక్రమాలపై రూపొందించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు మనో ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. కోవిడ్ సమయంలో నాట్స్ స్పందించిన తీరు అమోఘమన్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన తీరును మనో ప్రశంసించారు.
నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ, నాట్స్ నాయకులకు ఈ పుస్తకం ఓ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని.. పోటీపడి మరీ సేవా కార్యక్రమాలు చేసేందుకు దోహదపడుతుందని అన్నారు. నాట్స్ నాయకులతో ఎంతో సమన్వయంతో కరోనా సమయంలో స్పందించిన తీరు వల్లే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగామని నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు.
నాట్స్ కరోనా సమయంలో పోటీ పడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చాలా మందికి సాయం చేయగలిగామని నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి అన్నారు. నాట్స్లో కొత్త నాయకత్వానికి ఇలాంటి పుస్తకాలు మరింత స్ఫూర్తిని నింపుతాయని నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే అన్నారు. నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో వందల మంది పేదలకు కరోనా సమయంలో అండగా నిలవడం నిజంగా ఆనందంగా ఉందని, కాని మనం చేయాల్సింది ఇంకా ఎన్నో ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలని నాట్స్ అక్షర దీపిక సంపాదకులు మురళీకృష్ణ మేడిచర్ల అన్నారు. నాట్స్, తెలుగు టైమ్స్ తో కలిసి నాట్స్ కరోనా సేవల పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఈ పుస్తకం తీసుకురావడంలో కృషి చేసిన తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు, న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్ ను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు, సభ్యులతోపాటు, తెలుగు టైమ్స్ సిబ్బంది సయ్యద్ జాకీర్ హుస్సేన్, సురేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సావనీర్ కోసం NATS Sevalu in Covid Period ను చూడండి.













