NATS: తెలుగు వైభవాన్ని మురిపించేలా నాట్స్ సంబరాలు: అధ్యక్షుడు శ్రీహరి మందాడి
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన శ్రీహరి మందాడి (Srihari Mandadi) నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జూలై 4,5,6 తేదీల్లో హిల్స్‌బరో నది ఒడ్డున డౌన్‌టౌన్ అందాల నడుమ ఉన్న టాంపా కన్వెన్షన్ సెంటరులో ఈ సంబరాలు జరగనున్నాయి. ఆధ్యాత్మిక, సాహితీ, కళ, సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ సభలు ఉత్సాహంగా సాగనున్నాయని శ్రీహరి మందాడి తెలిపారు. సంబరాల్లో తెలుగుదనానికి పెద్దపీట వేస్తూ అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని నాట్స్ నిర్వహించే ఈ మహాసభలకు మరో విశేషం ఉందని అంటూ ముగ్గురు ప్రముఖ హీరోలు ఈ వేడుకలకు రావడం, ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు సంగీత విభావరిని నిర్వహించడం విశేషమని చెప్పారు. నాట్స్ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలతో అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి చేరువైందని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ కార్యక్రమాల ద్వారా నాట్స్ సేవలను తెలియజేసిందని అన్నారు. నేటి యువతను నాట్స్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు చెప్పారు. సేవ, వేడుకల్లో కమ్యూనిటీని భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
నాట్స్ సంబరాలపై మాట్లాడుతూ, ఈ సంబరాల్లో కమ్యూనిటీకి ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రవాస యువతకు ఈ సభల్లో పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పలు కార్యక్రమాల్లో ప్రవాస యువతీయువకులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవచ్చునని పేర్కొన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ లో తెలుగుదనం కనిపించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. క్లాసికల్ నృత్యాలతోపాటు జానపద నృత్యాలను కూడా ఏర్పాటు చేశారు. శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని కళాకారులతో శాస్త్రీయ నృత్యాలు సంగీత ప్రదర్శనలు జరుగుతాయి. సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా అష్టావధానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. యూత్ డ్యాన్స్ మెడ్లీ లాంటి ఎన్నో కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉంటాయన్నారు.
టాలీవుడ్ హీరో, హీరోయిన్ల మెడ్లీ కార్యక్రమాలు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి, తమన్ సంగీత విభావరులు ఆకట్టుకుంటాయని చెప్పారు. బిజినెస్ ఫోరం సమావేశాల్లో నిష్ణాతులు పాల్గొంటున్నారన్నారు. మహిళలకోసం ప్రత్యేక అంశాలమీద పలువురు ప్రసంగించనున్నారని కూడా శ్రీహరి తెలిపారు. అమెరికాలో పుట్టిన వారికోసం మెట్రిమోనియల్ కార్యక్రమాన్ని కూడా ఈ సంబరాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. యూత్ కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయని, ఎన్నో కార్యక్రమాలతో తెలుగువారి సంబరాలకు వేదికగా ఉన్న ఈ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని అధ్యక్షుడు శ్రీహరి మందాడి కోరారు.













