న్యూజెర్సీలో నాట్స్ చాఫ్టర్ కార్యక్రమాలు ముమ్మరం చేసేలా ప్రణాళిక
న్యూజెర్సీలో నాట్స్ కార్యక్రమాలను ముమ్మరం చేసేలా చక్కటి ప్రణాళికతో న్యూజెర్సీ నాట్స్ విభాగం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆన్లైన్ ద్వారా నాట్స్ న్యూజెర్సీ నాయకులు, నాట్స్ బోర్డ్ & ఈసీ నాయకులు, చాప్టర్ నాయకులు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలనే అంశాలపై స్పష్టతకు వచ్చారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ఈ సమావేశానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. న్యూజెర్సీలో చేపట్టబోయే కార్యక్రమాలకు నాయకత్వం వహించే వారి పేర్లను ఈ సమావేశంలో ప్రకటించారు. నాట్స్ నాయకులు దాదాపు 40 మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నాట్స్ న్యూజెర్సీ విభాగంలో జరిగే పలు కార్యక్రమాలకు బాధ్యత తీసుకునే వారి పేర్లను నిర్ణయించారు.
న్యూజెర్సీలో నాట్స్ సేవలను మరింత విస్తృత పరచడానికి నాట్స్ బృందం చూపిస్తున్న చొరవను నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ప్రశంసించారు. న్యూజెర్సీ నాట్స్ నాయకులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారనే విశ్వాసం తనకు ఉందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. న్యూజెర్సీ నాట్స్ విభాగానికి కావాల్సిన సహకారం ఎల్లవేళలా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికి నాట్స్ న్యూజెర్సీ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కో ఆర్డినేటర్ ప్రసాద్ టేకి లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.







