NATS: మనోహరంగా నాట్స్ సంబరాలు..సన్మానాలు
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా జూలై 6వ తేదీన టాంపా కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వేడుకల్లో రప్పా రప్పా సందడి నెలకొంది. నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) సంబరాలకు వచ్చిన అతిథులను హుషారెత్తించారు. తగ్గేదేలే నినాదంతో వేడుకలు జోరుగా సాగింది. నటి శ్రీలీల, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సుకుమార్ కుటుంబ సభ్యులు, ఫరియా అబ్దుల్లాలుఈ వేడుకల్లో హైలైట్స్ గా కనిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుల చేతుల మీదుగా పలువురికి విశేష సేవా పురస్కారాలను బహూకరించారు. జన్మభూమి అభివృద్ధికి ప్రవాసులు సహకరించాలని కోరారు. సభల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్‌లను సత్కరించారు.
మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి సంస్థలో తన హయాంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. అధ్యక్షుడు మందాడి శ్రీహరి అందరినీ కలుపుకుంటూ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. స్థానిక ప్రవాసుల సాంస్కృతిక ప్రదర్శనలు మనోహరంగా సాగాయి. నటుడు సాయికుమార్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయిత చంద్రబోస్‌లను సత్కరించారు. పోలీస్ స్టోరీ చిత్రంలో కనిపించే నాలుగో సింహం డైలాగ్‌ను సాయికుమార్ వేదికపై చెప్పగానే ప్రవాసుల కేకలు మిన్నంటాయి. తనకు, సుకుమార్‌కు పోలికలు ఉన్నాయని రాఘవేంద్రరావు చమత్కరించారు. ఆయనకు, తనకు తెల్లగడ్డం బాగా పెరిగిందని ఛలోక్తులు విసిరిన ఆయన, అడవి రాముడితో తాను, ‘పుష్ప’తో సుకుమార్ ఇద్దరం అడవిని నమ్ముకుని స్టార్‌డమ్ తెచ్చుకున్నామని అన్నారు.
కార్యక్రమాల్లో భాగంగా పలు సెషన్లు ఏర్పాటు చేశారు. సంబరాల్లో అవధాని నేమాని సోమయాజులు నర్తనశాల వేదికపై అష్టావధానాన్ని నిర్వహించారు. కిభశ్రీ సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, రామజోగయ్య శాస్త్రి, మేడిచెర్ల మురళీ, కళ్యాణ్ చక్రవర్తి, రాయవర్గం విజయభాస్కర్ తదితరులు పాల్గొని అవధానాన్ని రక్తి కట్టించారు. రావణుడదె సంహరించె రాము రణమునన్ అనే సమస్యను కళ్యాణ్ చక్రవర్తి ఇవ్వగా అవధాని సోమయాజులు పూరించారు. డా. గురవారెడ్డి సంతోషమయ జీవనంపై ప్రసంగించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అరవిందబాబు, ఏబీవీ వెంకటేశ్వరరావు, బాపిరాజు, కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కూచిభొట్ల ఆనంద్, గనగోని శ్రీనివాస్, జయంత్ చల్లా, కామినేని శ్రీనివాస్, కె.వి.రావు, బండ్ల గణేష్, నవీన్ ఎర్నేని, మన్నవ మోహనకృష్ణ, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరితో వేడుక ముగిసింది.







